దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఇటీవలే పూర్తయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈ కౌంటింగ్ కోసం భారత ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. కౌంటింగ్ కోసం 822 ఆర్ఓలు, 7000కు పైగా ఏఆర్ఓలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు శనివారం ఎన్నికల కమిషన్ తెలియజేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లతో సహా సుమారు 95,000 కౌంటింగ్ అధికారులు ఈ
కౌంటింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ఈ సారి కౌంటింగ్ హాల్స్‌ను 200 శాతం పెంచినట్టు ఈసీ పేర్కొంది.
2016 ఎన్నికల్లో 1002 కౌంటింగ్స్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సారి 2,364 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసింది. కోవిడ్ చర్యల నేపథ్యంలో పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. కౌంటింగ్ దృష్ట్యా కఠిన చర్యలను జారీ చేసినట్టు పేర్కొంది. ఆర్‌టీ-పీసీఆర్/ఆర్ఏటీ టెస్టులు చేయించుకోవడం కానీ, 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం కానీ చేయని అభ్యర్థులు, ఏజెంట్లను కౌంటింగ్ హాల్స్‌లోకి అనుమతించబోమని స్పష్టంగా చెప్పింది.
ప్రధానంగా బెంగాల్‌లో 256 కంపెనీల కేంద్ర బలగాలను మొహరించినట్లు ఈసీ వెల్లడించింది. అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఇదే తరహాలో బలగాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ ఎన్నికల అనంతరం మొత్తం ఐదు రాష్ట్రాలు/యూటీల్లోని అనేక పార్టీల భవితవ్యం తేలనుంది.