ఇటీవలే ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన భార్య మెకెంజీ స్కాట్ నుంచి విడిపోయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. లేటు వయసులో ఈయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారేంటి..? అని అనేకమంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆయనకంటే వయసులో పెద్ద బాడే బిల్‌గేట్స్(65) కూడా ఈ జాబితాలో చేరారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగా, ప్రపంచ కుబేరుడిగా ఎంతో ఖ్యాతి గాంచిన బిల్ గేట్స్ తాజాగా తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి వార్తల్లో నిలిచారు. సతీమణి మిలిందా గేట్స్(56)తో 27 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా బిల్ గేట్స్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్నేళ్ల తరువాత తమ బంధంపై పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన తరువాత ఇకపై కలిసి ఉండలేమనే నిర్ధారణకు వచ్చామని, అందువల్ల 27 ఏళ్ల తమ బంధాన్ని తెంచుకుంటున్నామని చెప్పారు.
ఆ ట్వీట్‌లో ‘27 ఏళ్ల మా వివాహ బంధానికి ముగింపు పలకాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ముగ్గురు పిల్లలను గొప్పగా పెంచి పెద్ద చేశాం. ప్రపంచంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మెరుగైన జీవనం కల్పించే ఫౌండేషన్ను స్థాపించాం. ఈ ఫౌండేషన్ కోసం మేము కలిసే పనిచేస్తాం. కానీ, జీవితంలోని తర్వాతి దశల్లో మేము దంపతులుగా కొనసాగలేకపోతున్నాం. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుండడంతో కొంత సమయం, గోప్యత కావాలనుకుంటున్నాం” అని బిల్ గేట్స్, మెలిందా గేట్స్ సంయుక్తంగా ఈ ప్రకటనలో వెల్లడించారు.
— Bill Gates (@BillGates) May 3, 2021
ఇదిలా ఉంటే ప్రస్తుతం బిల్‌గేట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి విలువ సుమారు 137 బిలియన్ డాలర్లు. ఇకపోతే 2000లో స్థాపించిన బిల్-మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకూ 53 బిలియన్ డాలర్లను వివిధ స్వచ్ఛంద కార్యాక్రమాలకు వినియోగించారు. కాగా, 1994లో వివాహబంధంతో ఒక్కటైన బిల్‌గేట్స్ దంపతులు.. సుదీర్ఘ కాలం పాటు కాపురం చేసి ఇప్పుడు విడిపోతుండడం గమనార్హం.