భారత్లో కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, రోజురోజుకూ కరోనా ఉధృతి పెరుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోందని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ కోలుకోవాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, కరోనా రోగుల కోసం చైనా మాదిరి తాత్కాలిక పద్ధతిలో ప్రత్యేక ఆస్పత్రులు నిర్మించాలని ఫౌచీ సూచించారు. దీని కోసం ఆర్మీ సాయం తీసుకోవాలని అన్నారు. ఇక వీటన్నింటికంటే ప్రధానంగా వెంటనే దేశవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ విధించాలని, ఈ మూడు మార్గాల ద్వారా మాత్రమే భారత్ కోలుకోగలదని ఫౌచీ చెప్పుకొచ్చారు. వీటిని భారత ప్రభుత్వం పట్టించుకోకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాధ్యమైనంత ప్రభుత్వం వీటిని అమలు చేయాలని, అప్పుడే భారత్ కోలుకోగలుగుతుందని అన్నారు.
ఫౌచీ ఈ మధ్య భారత్‌లోని కరోనా పరిస్థితులపై వరుస ప్రకటనలు చేస్తున్నారు. భారత్ కోలుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలి..? ఏం చేయాలి..? అనే విషయాలపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా మరోసారి మీడియాతో దీనిపైనే చర్చించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే లాక్‌డౌన్ తప్పనిసరని దేశంలోని నేతలు, వ్యవస్థలు కూడా అభిప్రాయపడుతుండడం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కరోనా పరిస్థితులపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశంలో ఇంత దారుణ పరిస్థితులు కొనసాగుతుంటే అధికార బీజేపీ, ప్రధాని మోదీ చీమ కుట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం ఏం ఆలోచించిందో కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.న తన దృష్టిల్లో ప్రస్తుత కల్లోలంలో దేశ వ్యాప్త లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని అన్నారు.
ఇక సీఏఐటీ(ఆల్ ఇండియా ట్రేడర్స్) అసోసియేషన్ కూడా దేశంలో లాక్‌డౌన్ తప్పదని వ్యాఖ్యానించింది. తాము నిర్వహించిన సర్వేలో అత్యధిక శాతం ట్రేడర్స్ లాక్‌డౌన్ విధించాల్సిందేనని సమాధానమిచ్చారని, అందువల్ల వెంటనే దేశంలో లాక్ డౌన్ విధించాలని నేరుగా ప్రధానిని కోరారు. లాక్ డౌన్ విధించినా గతేడాదిలానే నిత్యావసరాల సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.