పశ్చిమ బెంగాల్ నాట ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ)ని ఎలాగైనా సరే ఓడించి బెంగాల్లో కాషాయ జెండా ఎగరేయాలని కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు బీజేపీ నేతలు.. మరోవైపు తృణముల్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో నందిగ్రామ్‌లో తనకు ఓటుకు వేయాలని అభ్యర్థించడానికి వెళ్తున్న దీదీపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె శరీరంపై పలుచోట్ల.. ముఖ్యంగా కాలు, ఎడమ మడమలకు గట్టి దెబ్బలు తగలడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇదంతా బీజేపీ పనేనని టీఎంసీ నేతలు.. అబ్బే తాము అలాంటి చీప్ ట్రిక్స్ చేయమని కమలనాథులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తనకు ఇంతలా గాయాలయినప్పటికీ దీదీ మాత్రం అవసరమైతే వీల్‌చైర్‌లోనే ప్రచారానికి వస్తానని ఓ సందేశాన్ని అభిమానులు, కార్యకర్తలకు పంపారు.
ఇదిలా ఉంటే.. ఈ దాడిపై గత 48 గంటలుగా సోషల్ మీడియాలో.. మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైజాగ్ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడికత్తి దాడి ఘటనతో.. దీదీపై దాడిని పోలుస్తున్నారు. అది కోడికత్తి పార్ట్-01 అయితే.. దీదీపై దాడి కోడికత్తి పార్ట్-02 అని సంచలన వ్యాఖ్యలే చేస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి, డిబెట్స్‌లలో పార్టీ స్వరాన్ని వినిపించే లంకా దినకర్ వంటి నేతలు సోషల్ మీడియాలో కోడికత్తి పార్ట్-02 అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఏపీకి.. బెంగాల్‌కు ఏంటి సంబంధమన్నది కమలనాథులు.. ఆ పార్టీని సపోర్ట్ చేసే కార్యకర్తలకే తెలియాలి.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఏపీలో జగన్‌కు, ఇప్పుడు దీదీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నది ప్రశాంత్ కిషోర్ (పీకే). ఏపీలో జగన్‌పై దాడి ఘటనకు కారకులు ఎవరో..? అనేది ఇప్పటికీ స్పష్టంగా ఎవరూ తేల్చలేదు. అదంతా డ్రామా అని అప్పట్లో అధికార పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ఆ ఘటనకు కొన్ని పత్రికలు, టీవీ చానెల్స్ వ్యంగ్యంగా కోడికత్తి అని కూడా సంబోదించాయి.. ఇప్పటికీ అలానే అంటున్నాయి. ఈ ఘటనకు కర్త, కర్మ, క్రియ పీకేనని అప్పట్లో హడావుడి జరిగింది. ఇప్పుడు దీదీపైనే దాడి కూడా పీకే వ్యూహాల్లో భాగమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింపతీ కోసమే పీకే ఇలా చేయించారనే టాక్ కూడా నడుస్తోంది. మరి ఇందులో నిజానిజాలేంటి..? ఇంతకీ ఇది దాడా..? లేక పీకే ఆడించిన డ్రామానా..? అన్నది తేల్చాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర పోలీసులపై ఎంతైనా ఉంది.