హైదరాబాద్: రాష్ట్రంలో మూడో విడత లాక్‌డౌన్‌ను విధిస్తూ ఆదివారం రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ దఫా కొన్ని సడలింపులను పెంచింది. అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో సమయాల్లో కూడా మార్పులు చేస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ విషయంపై మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఉదయం 7 నుంచి 8.45 గంటల వరకు మాత్రమే మెట్రోరైలు సేవలు అందుబాటులో ఉన్నాయని, అయితే తాజా సడలింపుల నేపథ్యంలో ఇకపై ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మెట్రో సేవలను అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.
జూన్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని తెలిపారు. చివరి మెట్రో రైలు ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై చివరి స్టేషన్‌కు 12.45కు చేరుకుంటుందని ప్రకటించారు. పూర్తి స్థాయి కరోనా నిబంధనల నడుమ ఈ ప్రయాణాలు సాగుతాయని తెలిపారు. దీనికి ప్రయాణికులు కూడా సహకరించాలని కోరారు. కచ్చితంగా అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని సూచించారు. స్టేషన్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతుందని తెలిపారు.
కాగా.. రాష్ట్రంలో మూడోవిడత లాక్‌డౌన్‌ను విధిస్తూ రాష్ట్ర సర్కార్ ఆదివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కొన్ని నిబంధనలను సడలించింది. గత 18 రోజులుగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా.. ఇకపై మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇస్తూ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు అన్ని రకాల ప్రజా రవాణాకు మరో గంట అదనంగా వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలోనే మెట్రో సమయాల్లోనూ మార్పులు చేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.