టోక్యో: కరోనా నాలుగో వేవ్ కారణంగా జపాన్ అల్లకల్లోలం అవుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ 4వేలకు పైగా కేసులు అక్కడ నమోదవుతున్నాయి. దీంతో ప్రధాని యోషిహిడే సూగా టోక్యోతో పాటు మరో 8 నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టోక్యో, ఒసాకా, క్యోటో, హ్యోగో, ఐచి, ఫ్యుకోకా, హొక్కైదో, ఒకాయామ, హిరోషిమా నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఒప్పందం ప్రకారం.. ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఈ ఒలింపిక్స్ నిర్వహించే బాధ్యత నుంచి టోక్యో తప్పుకునేందుకు వీలుందా..? అంటే లేదనే చెప్పాలి.
ఒలింపిక్ పోటీలను రద్దు చేసే అధికారం టోక్యోకు లేదు. కేవలం ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓసీ)కు మాత్రమే ఉంది. ఈ విషయంపై ఐఓసీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్ ఈ మధ్యనే మాట్లాడుతూ.. కరోనా నాలుగో వేవ్ ఉన్నప్పటికీ పోటీలు జరుగుతాయని తేల్చి చెప్పారు. దీంతో టోక్యోకు మరో అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే టోక్యోకు ఆ అధికారం లేకపోయినా జపాన్ ప్రభుత్వానికి మాత్రం ఆ హక్కుంది. ఐఓసీ రూల్స్‌ను పక్కనపెడుతూ ఈ గేమ్స్‌ను రద్దు చేసే అధికారం దేశ ప్రభుత్వానికి ఉంటుంది. అయితే దానివల్ల భారీ స్థాయిలో ఆర్థిక నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఒకవేళ ఐఓసీ అనుమతితోనే క్రీడలను రద్దు చేసినా.. దానివల్ల కూడా బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఈ నష్టం నుంచి కోలుకునేందుకే జపాన్ ఎంతో కాలం పడుతుందంటే అతిశయోక్తి కాదు.
కాగా.. దేశంలో కరోనా నాలుగో వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించవద్దంటూ జపాన్ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ గేమ్స్ వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుందని, దానివల్ల దేశం మరింత ప్రమాదంలోకి నెట్టివేయబడుంతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార ఎల్‌డీపీ(లిబరల్ డెమోక్రటిక్ పార్టీ)కి వ్యతిరేకంగా ఇప్పటికే ప్రతిపక్ష నేతలు అనేకమంది.. ఒలింపిక్ గేమ్స్‌ను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే జపాన్ ప్రభుత్వం మాత్రం ఒలింపిక్ గేమ్స్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.