అమరావతి: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో చారిత్రక విజయం సాధించింది వైసీపీ. 151 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోవడమే కాకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 23 సీట్లు కైవసం చేసుకుంది. అంత భారీ విజయంతో సీఎం పీఠం ఎక్కిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్లుగా రాష్ట్ంరలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆదివారంతో ఆయన పాలనకు రెండేళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే రెండేళ్ల పాలనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఓ పుస్తకాన్ని ఆవిష్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నామని, మెనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ప్రతి ఒక్కరి సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నామని పేర్కొన్నారు.
అలాగే ప్రతి గ్రామ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగాం. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశాం. రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉంది. రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నానని’ సీఎం జగన్ అన్నారు.
అంతేకాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా 86 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు చేరాయన్నారు. ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ. 95,528 కోట్లు జమ చేశామన్నారు. వివిధ పథకాల ద్వారా రూ. 36,197 కోట్లు ఇచ్చామని, మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని తెలిపారు. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించామని సీఎం జగన్ వెల్లడించారు.