మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రాంరంభం కానున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి దెబ్బ తగిలింది. కీలక ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ జట్టుకు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. ‘బయోబబుల్ వాతావరణంతో విసిగిపోయా.. అందుకే ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనలేను’ అని హైదరాబాద్ ఫ్రాంచైజీకి మిచెల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా.. మిచెల్ మార్ష్ గత సీజన్ ఐపీఎల్‌లో ఆడినప్పటికీ.. గాయం కారణంగా సగం టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక ఈ సారి పూర్తి టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో సన్‌రైజర్స్‌కు భారీ దెబ్బ తగిలినట్లైంది. కాగా.. సన్‌రైజర్స్ కీలక బ్యాట్స్‌మన్, న్యూజిల్యాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఇటీవల జరిగిన ఆసీస్ టోర్నీలో గాయపడ్డాడు. దీంతో అతడు ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో ఆడతాడా..? లేదా..? అనే విషయం అనుమానంగా ఉంది. ఇప్పటివరకు దీనిపై కేన్ కానీ, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
కివీస్ కెప్టెన్ కేన్ విలిమ్సన్, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఇద్దరూ సన్‌రైజర్స్ జట్టుకు కీలక ఆటగాల్లుగా ఉన్నారు. కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయంపై అప్పట్లోనే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది. అతడికి కొంత విరామం కావాలని, అందుకే సిరీస్‌కు ఎంపిక చేయలేదని చెప్పింది.
అలాగే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్‌ల నేపథ్యంలో కేన్ విలియమ్సన్ ఫిట్‌గా ఉండటం తమకెంతో ముఖ్యమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. కివీస్ హెడ్ కోచ్ ప్రకటన నేపథ్యంలో విలియమ్సన్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కీలక ఆటగాడు బెయిర్ స్టోలపై అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలోనే అతడు ఐపీఎల్‌కు రావడంపై సన్‌రైజర్స్ యాజమాన్యం ఆందోళనగా ఉంది.