పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మరో సూపర్ స్టార్ కాగలడని, అయితే దాని కోసం అర్థ సెంచరీలు సరిపోవని, వాటిని సెంచరీలుగా మలుచుకోవడం నేర్చుకోవాలని టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు మాజీ ఓపెనర్ సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. తాజా సిరీస్‌లలో పంత్ 70-80 పరుగులు సునాయాసంగా చేస్తున్నాడని, కానీ వాటిని సెంచరీలుగా మలచలేకపోతున్నాడని, దానిని పంత్ అధిగమించాలని వీరూ సూచించాడు. అలాగే అతడు జట్టు బాధ్యత తీసుకోవడం అలవరుచుకోవాలని, అది సాధిస్తే అతడి స్థానం టీమిండియాలో సుస్థిరం చేసుకోగలుగుతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసీస్ సిరీస్ నుంచి రిషబ్ పంత్ అద్భుతమైన ఆటతీరుతో అలరిస్తున్నాడు. ఎడాపెడా అర్థసెంచరీలు బాదుతూ జట్టులో కీలక ఆటగాడిగా స్థానం సంపాదించాడు.
పంత్‌పై సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియాకు సానుకూలాంశం ఏదైనా ఉందంటే అది రిషభ్ పంత్ ఒక్కడేనని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రిషబ్ తనను ఆటతీరు, బ్యాటింగ్ శైలి, మైదానంలో నడుచుకునే విధానం అన్నీ తననెంతగానే ఆకట్టుకుంటాయని చెప్పాడు. ముఖ్యంగా వన్డేల్లో సెకండ్ పవర్‌ప్లేను పంత్ అద్భుతంగా వినియోగించుకుంటున్నాడని సెహ్వాగ్ అన్నాడు. ‘పంత్ సానుకూల దృక్పథంతో ఉంటాడు. అతన్ని చూస్తే నా కెరీర్ ప్రారంభ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇతరులు ఏమనుకుంటున్నారనే పంత్ పట్టించుకోడు. తన ఆటపైనే దృష్టి పెడతాడు’ అంటూ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
కాగా.. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన పంత్‌ను టీమిండియా మాజీలు అనేకమంది అభినందిస్తున్నారు. ఈ సిరీస్‌లో రెండు వన్డేలు మాత్రమే ఆడిన పంత్ 151.96 స్ట్రైక్‌రేట్, 77.50 సగటుతో 155 పరుగులు చేశాడు. అంతకుముందు టీ20లో కూడా విలువైన పరుగులు చేశాడు. ఇక టెస్ట్ సిరీస్‌లో అర్థసెంచరీలతో అదరగొట్టాడు. దానికి తోడు 2020-2021 మధ్య జరిగిన ఆసీస్ సిరీస్‌లోనూ పంత్ గొప్ప ప్రతిభ కనబరిచాడు.