న్యూఢిల్లీ: ఐపీఎల్ 14 ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ జట్లు కూడా అభిమానుల్లో ఉత్సుకతను రెట్టింపు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ జట్టు ప్యాట్ కమిన్స్‌ను దాదాపు 15 కోట్లకు కొనుగోలు చేసింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడాడు. ఎప్పటిలానే ఈ ఐపీఎల్ సీజన్‌లో కూడా ఏ జట్లు కూర్పు ఎలా ఉండాలి అనే దానిపై ఆకాశ్ చోప్రా పలు సూచనలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల గురించి చెప్పాడు. ఈ నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ గురించి ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కమిన్స్ అద్భుతమైన డెత్ బౌలర్ కాకపోయినా.. అతడికోసం కేకేఆర్ 15 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిందని, అందువల్ల అతడిని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని అన్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాశ్ అనేక విషయాలు తెలిపాడు. ఈ క్రమంలోనే కమిన్స్ గురించి మాట్లాడుతూ.. అతన్ని ఎలా ఉపయోగిస్తే బాగుంటుందనే దానిపై కేకేఆర్ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నాడు. ‘ కమిన్స్ గన్ డెత్ బౌలర్ కాకపోవచ్చు. కానీ ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టగల సత్తా అతడికి ఉంది.
”కమిన్స్ చేతికి కొత్త బంతి వచ్చిందంటే ఎదురు ఎవరైనా ముచ్చెమటలు పట్టించగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి 6 ఓవర్లలోనే ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కకావికలం చేయగలడు. కాని కమిన్స్ డెత్ ఓవర్లలో అంత మెరుగ్గా రాణించలేడు. అందువల్ల సాధ్యమైనంత వరకూ కమిన్స్‌కు పవర్ ప్లేలోనే ఎక్కువ ఓవర్లు ఇస్తే మంచిది. డెత్ ఓవర్ల సమయానికి అతనికి ఎక్కువ ఓవర్లు ఉంచకండి. అయితే కమిన్స్ పేస్, బౌన్స్‌తో పాటు బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగలడు. కొత్త బంతిని స్వింగ్ చేయడం కష్టమే కానీ కమిన్స్‌కు ఆ సామర్థ్యం ఉంద”ని ఆకాష్ అభిప్రాయపడ్డాడు.
అంతేకాకుండా కమిన్స్ బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణించగలడు. కమిన్స్‌కు బ్యాటింగ్ అవకాశం ఇస్తే బాగుంటుందని అన్నాడు. ఒకవేళ ఆండ్రూ రస్సెల్ పదే పదే విఫలమైతే ఆ స్థానంలో కమిన్స్‌ను పంపాలని, భారీ షాట్లు కొట్టే సామర్థ్యం కమిన్స్‌లో ఉందని ఆకాష్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో కమిన్స్ కమ్మిన్స్ విధ్వంసకర బ్యాటింగ్ తో ఆదరగొట్టాడని, ఈ సీజన్‌లోనూ కమిన్స్ బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటాడనే అనుకుంటున్నానని చోప్రా అన్నాడు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 11వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కేకేఆర్-సన్‌రైజర్స్ జట్ల మధ్య ఆయా జట్ల తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కమిన్స్ ఏ స్థాయి ప్రదర్శన కనబరుస్తాడో వేచి చూడాలి.