ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఘన విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసి టోర్నీలో టాప్-2కు చేరింది. ఓపెనర్ పృధ్వీ షా(82: 41 బంతుల్లో.. 1 ఫోర్లు, 3 సిక్స్‌లు) బ్యాటుతో వీరవిహారం చేయడంతో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. మరో ఓపెనర్ శిఖర్ ధవన్(46: 47 బంతుల్లో.. 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి చక్కగా సహకరించారు. విజయానికి 20 పరుగుల దూరంలో షా అవుట్ అయినా పంత్(16), స్టోయినిస్(6) లాంఛనం పూర్తి చేశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో 21 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో మళ్లీ రెండో స్థానానికి చేరింది. అర్థ సెంచరీతో రాణించిన పృధ్వీ షాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక కేకేఆర్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీయగా మిగతా బౌల్లలో ఒక్కరికి కూడా వికెట్ దక్కలేదు.
కాగా.. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ అతి కష్టం మీద 150 పరుగులు దాటింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(43: 38 బంతుల్లో.. 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించినా.. ఓపెనర్ నితీశ్ రాణా(15: 12 బంతుల్లో.. 1 ఫోర్, 1 సిక్స్)తో పాటు వన్ డౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి(19: 17 బంతుల్లో.. 2 ఫోర్లు) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(0) డకౌట్, నరైన్(0) గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరగడంతో 10 ఓవర్లలో 75 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కేకేఆర్.
ఇంత దారుణంగా వికెట్లు కోల్పోవడంతో ఒకానొక దశలో కేకేఆర్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా..? అనే ఆందోళన అభిమానుల్లో కలిగింది. అయితే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్(45 నాటౌట్: 27 బంతుల్లో.. 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ 6 వికెట్లు 154 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌లకు చెరో రెండు వికెట్లు దక్కగా.. ఆవేష్ ఖాన్, స్టోయినిస్‌లు చెరో వికెట్ తీశారు.