ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌లో దారుణ ప్రదర్శన చేయడమే కాకుండా.. బౌలింగ్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిచిన చవి చూసింది. దీంతో ఈ సీజన్లో వరుస ఓటముల కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోగా ఇప్పుడు మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్స్‌కు మరింత దూరమైంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై-రైజర్స్ మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. జోరుమీదున్న జానీ బెయిర్‌స్టో (7)ను స్వల్పస్కోరుకే శామ్ కరాన్ పెవిలియన్ చేర్చాడు. అయితే మరో ఓపెనర్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ (57), మనీష్ పాండ్ (61) చక్కగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వా చివర్లో కేన్ విలియమ్సన్ కేవలం 10 బంతుల్లోనే 26, కేదార్ జాదవ్ 4 బంతుల్లో 12 బ్యాటు ఝుళిపించడంతో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్ (75), ఫాఫ్ డు ప్లెసిస్(56) అదిరిపోయే ఆరంభం అందించారు. రుతురాజ్ ఐపీఎల్ కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. వీరి ధాటికి చెన్నై జట్టు వికెట్ కోల్పోకుండా 129 పరుగులు చేసింది. అయితే రషీద్ ఖాన్ మరోసారి తన సత్తాచాటి.. క్రీజులో కుదురుకున్న గైక్వాడ్, డుప్లెసిస్‌తోపాటు మొయీన్ అలీ (8)ని కూడా పెవిలియన్ చేర్చాడు. కానీ అప్పటికే చెన్నై విజయం దాదాపు ఖరారైపోయింది. చివర్లో రవీంద్ర జడేజా (7), సురేష్ రైనా (17) లాంఛనం పూర్తిచేశారు. దీంతో చెన్నై జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 172 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.