ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఢిల్లీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరింది. మ్యాచ్ చివర్లో సిక్స్ కొడితే గెలుస్తారనగా.. స్ట్రైకింగ్‌లో ఉన్న పంత్ ఫోర్ మాత్రమే కొట్టాడు. దీంతో ఆర్సీబీ చేతిలో ఢిల్లీ ఒక్క పరుగులు ముందు చతికిలబడింది. అయితే పంత్ సిక్స్ కొడితే మ్యాచ్ గెలుస్తుందనే ఆలోచన కంటే.. ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. 19 ఓవర్ల వరకు 150 పరుగులు కూడా ఆర్సీబీ ఆఖరి ఓవర్‌లో డివిలియర్స్ విజృంభణతో ఏకంగా 171 పరుగులు చేసింది. ఈ ఓవర్ వల్లనే ఢిల్లీ ఓడిపోయిందని, డివిలియర్స్ వంటి మేటి బ్యాట్స్‌మన్ అర్థ సెంచరీ చేసి క్రీజులో ఉన్న సమయంలో ఎవరైనా స్టోయినిస్‌కు బౌలింగ్ ఇస్తారా అంటూ ఢిల్లీ కెప్టెన్ పంత్‌పై అనేకమంది సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఓవర్ వేసే సమయంలో కామెంటేటర్లు కూడా పంత్ నిర్ణయాన్ని పూర్తిగా తప్పుబట్టారు.
విమర్శల నేపథ్యంలో పంత్ నోరు విప్పాడు. ఆఖరి ఓవర్ స్టోయినిస్‌కు ఇవ్వడంపై పంత్ వివరణ ఇచ్చాడు. మ్యాచ్ తర్వాత పంత్ మాట్లాడుతూ.. ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం నిరాశపరిచిందని, తాము గెలుపు ముందు బోల్తా పడ్డాంమని పంత్ అన్నాడు. ఈ వికెట్‌పై ఆర్సీబీ 10-15 పరుగులు అదనంగా చేయడం వల్లే ఆ జట్టుకు విజయం దక్కిందని అభిప్రాయపడ్డాడు. ఇక తమ జట్టులో హెట్‌మెయిర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని, టార్గెట్‌కు అతి చేరువగా రావడానికి అతడి ఇన్నింగ్సే కారణంమని పంత్ చెప్పుకొచ్చాడు. ఆఖరి ఓవర్‌లో మ్యాచ్ ఫినిష్ చేసేందుకు తామిద్దరిలో ఎవరికి బ్యాటింగ్ వచ్చినా హిట్టింగ్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నామని, కానీ పరుగు దూరంలో ఓటమి ఊహించలేదని అన్నాడు.
అంతేకాకుండా ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో ఆఖరి ఓవర్ స్టోయినిస్‌తో వేయించడానికి తమ స్పిన్నర్లు రాణించకపోవడమే కారణమని పంత్ చెప్పాడు. ‘మేం అనుకున్నట్లు మా స్పిన్నర్లు రాణించలేదు. దాని వల్లనే ఆఖరి ఓవర్‌ను స్టోయినిస్ చేత వేయించాల్సి వచ్చింది’ అంటూ పంత్ అసలు విషయం చెప్పాడు. దాంతో పాటు ప్రతీ మ్యాచ్ నుంచి ఓ పాఠం నేర్చుకుంటూ మెరుగుపడుతున్నామని, ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌ల ద్వారా పాజిటివ్ అంశాలను మాత్రమే తీసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని వెల్లడించాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ముందుగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తొలి మూడు వికెట్లు త్వరగా కోల్పోయినా ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్(75 నాటౌట్; 42 బంతుల్లో.. 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆఖరి వరకు క్రీజులో పాతుకుపోవడంతో ఆర్సీబీ మంచి స్కోరు చేసింది. అతడికి రజత్ పటిదార్ (31: 22 బంతుల్లో.. 2 సిక్స్‌లు) రాణించాడు. ఆ తర్వాత 172 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. రిషభ్ పంత్ (58 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్( 53 నాటౌట్) అర్ధ సెంచరీలు సాధించినా ఆ జట్టు ఆఖరి బంతికి ఓటమి చవిచూసింది.