దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో క్రికెటర్లంతా ఒకరి తరువాత ఒకరుగా బాధితులకు అండగా ఉండేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే సచిన్, రహానే, పాండ్యా బ్రదర్స్, శిఖర్ ధవన్‌ల వంటి సీనియర్లతో పాటు శ్రీవాత్సవ్ వంటి జూనియర్ ఆటగాళ్లు తమ శక్తికి తోచినంత సాయం అందిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా చేరాడు. పంత్ హేమకుంత ఫౌండేషన్ ద్వారా కోవిడ్ రోగులకు సాయం అందించనున్నట్లు పంత్ స్వయంగా తెలిపాడు. కరోనా బాధితుల కోసం అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, ఔషధాలను అందించనున్నట్లు తెలిపాడు. అంతేగాక గ్రామీణ ప్రాంతాలతో పాటు నాన్ మెట్రో నగరాల్లో మెడికల్ సపోర్ట్ అందించనున్న ఆర్గనైజేషన్‌లకు తనకు తోచిన సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో ఓ సుధీర్ఘ లేఖను షేర్ చేసి పంత్ వెల్లడించాడు.
ఈ లేఖలో పంత్ కరోనా పరిస్థితులను వివరిస్తూ అందరూ ఒక్కటై ఈ మహమ్మారితో పోరాడాలని, ఆపదలో ఉన్నావారిని ఆదుకోవడానికి ఏకం కావాలని పిలుపునిచ్చాడు. ”హాయ్ ఫ్రెండ్స్.. ఇప్పుడు మనదేశం కరోనా సెకండ్‌వేవ్‌తో అల్లాడిపోతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు అండగా నిలబడాల్సి ఉంది. దేశంలో కరోనాతో వేలమంది చనిపోతున్నారు. వారు మనకేం కాకపోవచ్చు. మనం బంధువులు, స్నేహితులు అయితే వెంటనే స్పందించేవాళ్లం. కానీ ఒక భారతీయుడిగా మన సహచరులను కోల్పోతున్నవారి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన సమయం ఇది.
అందుకే నా వంతుగా హేమకుంత ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్, మందులు అందించడానికి ప్రయత్నిస్తున్నా. వాటితో కనీసం కొంతమంది ప్రాణాలైనా కాపాడొచ్చు. మీరు కూడా నాతో కలిసి వస్తే ఇంకా ఎందరి ప్రాణాలనో కాపాడొచ్చు. రండి అందరు ముందుకు రండి.. తోచినంత సాయం చేయండి. ఇక చివరిగా కోవిడ్ రూల్స్‌ను పాటిస్తూ అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. వీలైతే తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రయత్నించండి.” అంటూ సుదీర్ఘంగా ఆ లేఖలో రాసుకొచ్చాడు.