ఒకపక్క కరోనాతో భారత్ లాంటి దేశాలు అష్టకష్టాలు పడుతుంటే చైనా చేసిన మరో పని ప్రపంచాన్నే వణికించింది. ఆ దేశం ప్రయోగించిన ‘లాంగ్ మార్చ్ 5బి’ రాకెట్ అంతరిక్షంలో కూలిపోవడంతో అది ఎక్కడ పడుతుందో తెలియక అంతా బెంబేలెత్తిపోయారు. అయితే ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. ఈ రోజు తెల్లవారుజామున ఆ శకలాలు హిందూ మహాసముద్రంలో కూలాయి. భూ వాతావరణంలోకి రాగానే చాలా వరకు శకలాలు పూర్తిగా భస్మమయ్యాయి. చిన్న చిన్న భాగాలు మిగిలిపోగా అవి సముద్రంలో కూలాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రాకెట్ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పటి నుంచి చైనా మ్యాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ వాటి దిశను పరిశీలించింది. హిందూ మహా సముద్రంపై రాకెట్ భాగాలు విచ్ఛిన్నమయినట్లు ముందుగానే తెలియజేసింది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలో శకలాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. చైనా పేర్కొన్న ఈ ప్రాంతం మాల్దీవులకు కొద్ది దూరంలోనే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో మాల్దీవులకు ప్రమాదం ఉంటుందేమోనని అంతా భావించారు. అయితే అవి సముద్రంలో కొంత దూరం పడడంతో ఎలాంటి నష్టం జరగలేదు.
చైనా ప్రభుత్వ మీడియాలో ప్రసారమైన దాని ప్రకారం.. ‘ఈ రాకెట్ బీజింగ్ కాలమానం దృష్ట్యా ఉదయం 10.24 గంటలకు (02.24 గంటలు జీఎంటీకి) భూ వాతావరణంలోకి ప్రవేశించింది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద దీని శిథిలాలు పడ్డాయి. మాల్దీవుల సమూహానికి పశ్చిమ దిశలో హిందూ మహా సముద్రంలో ఇది పడింది. అత్యధిక శిథిలాలు వాతావరణంలోనే కాలిపోయాయి’ అని పేర్కొంది.
నిపుణుల అంచనాలే నిజమయ్యాయి
భూమిపై 70 శాతం నీరు ఉండటం వల్ల లాంగ్ మార్చ్ 5బీ విడి భాగాలు సముద్రంలోనే పడతాయని కొందరు నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ఆదివారం దీని విడి భాగాలు హిందూ మహా సముద్రంలో పడటంతో ఈ అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇంత భారీ విడి భాగం తిరిగి భూమిపైకి ఎటువంటి నియంత్రణ లేకుండా వస్తుండటంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ పడుతుందో, ఎంత నష్టానికి కారణమవుతుందోనని భయపడ్డారు. అయితే నిపుణుల అంచనా ప్రకారం ఈ శకలాలు సముద్రంలో పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శకలాలు కుప్పకూలుతున్న దృశ్యాలను మాల్దీవుల నుంచి కొందరు ఫోన్‌లో బందించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించినవిగా పేర్కొంటూ కొంతమంది కొన్ని వీడియోలు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే లాంగ్ మార్చ్ తొలి ప్రయాణం 2020 మేలో జరిగింది. ప్రస్తుతం పేలిపోయిన రాకెట్ 5బీ రకాల్లో రెండోది. గత ఏడాది మొదటి లాంగ్ మార్చ్ 5బీ శిథిలాలు ఐవరీ కోస్ట్‌లో పడ్డాయి. వీటి వల్ల కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.