ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను కేవలం 123 పరుగులకే కట్టడి చేసిన కేకేఆర్ ఆ తర్వాత 20 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చివరి వరకు క్రీజులో పాతుకుపోయి జట్టును గెలిపించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేకేఆర్ డగౌట్ నుంచి మోర్గాన్‌కు అందిన సీక్రెట్ కోడ్ మెసేజ్‌లు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్లో ఇలా డగౌట్ నుంచి కోడ్ లాంగ్వేజ్‌లో సందేశాలు అందడం ఇదే తొలిసారి. అయితే ఈ క్రమంలోనే అనేకమంది దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్ బ్యాటింగ్ సమయంలో ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్‌కు ఆ జట్టు ఎనలిస్ట్ నాథన్ లీమన్ ఓ సీక్రెట్ సందేశం పంపాడు. డగౌట్ నుంచి ‘54’ కోడ్‌ను చూపించాడు. ఆ సంఖ్యను ప్లకార్డులపై ఉంచి బల్లపై ఉంచి ప్రదర్శించాడు. ఇదే ఇప్పుడు క్రికెట్ అభిమానులు, విశ్లేషకుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా గెలిచిన గెలుపు కూడా ఓ గెలుపేనా అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా కొందరు ఈ కోడ్‌కు సంబంధించి తమ తమ అంచనాలు కూడా వేస్తున్నారు. ఇది ఆఫ్‌సైడ్-లెగ్‌సైడ్ ఫీల్డింగ్‌కు సంబంధించిన కోడ్ కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిపై వివాదం చెలరేగకపోయినా ఇలా కోడ్ రూపంలో డగౌట్ నుంచి సందేశాలు పంపడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు.
ఇక ఇలా సందేశాలు అందుకోవడాన్ని కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ సమర్ధించుకున్నాడు. ఇందులో ఏ మాత్రం తప్పు లేదని, దీనిని గేమ్ ప్లాన్‌లో భాగంగానే చూడాలని అన్నాడు. కాగా.. గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో కూడా ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్‌కు ఇలానే డగౌట్ నుంచి సందేశాలు వచ్చాయి. అప్పుడు మోర్గాన్ ఫీల్డింగ్ సెట్ చేసే క్రమంలో ఇంగ్లండ్ జట్టు అన్లిస్ట్గా ఉన్న నాథన్ లీమనే ఈ సందేశాలు పంపాడు. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భాగంగా బౌలింగ్ మార్పు, ఫీల్డింగ్ కూర్పునకి సహాయపడేలా నాథన్ బోర్డుపై 3C, 4E అంటూ స్టేడియంలో ప్రదర్శించాడు. వాటిని చూస్తూ కెప్టెన్ మోర్గాన్ తన వ్యూహాల్ని మార్చుకుంటూ వెళ్లాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా మూడు టీ20ల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకుంది.
ఇదిలా ఉంటే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఇలా సందేశాలు పంపడాన్ని సమర్థించాడు. ఇక్కడ ఎవరైనా తమ జట్టును నడిపించడానికి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవచ్చన్నాడు. డగౌట్ నుంచి ఇలా చెప్పడానికి కెప్టెనే కావాల్సిన అవసరం లేదన్నాడు. అది కేకేఆర్ గేమ్ ప్లాన్‌లో భాగంగానే చూడాలని, తనకు తెలిసినంతవరకూ 54 సంఖ్య అనేది గేమ్ ప్లాన్ అయ్యుంటుందని, ఈ చిన్న సాయంలో తప్పేమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.