కోల్‌కతా నైట్‌రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఇరు జట్లూ బౌండరీల మోత మోగించాయి. మైదానంలో పరుగుల వరద పారించాయి. 200కు పైగా పరుగులతో అదరగొట్టాయి. అయితే ఎట్టకేలకు విజయానికి 18 పరుగుల దూరంలో కేకేఆర్ జట్టు ఆగిపోవడంతో సీఎస్‌కే విజయం సాధించింది. దీంతో ధోనీ సేన ఓటమి అంచులవరకు వెళ్లి బయటపడింది. చివరకు విజయం సాధించడంతో ఊపిరి పీల్చుకుంది.
ఈ క్రమంలోనే చెన్నై కెప్టెన్ ధోనీ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మ్యాచ్‌లో జడేజాను మాత్రమే స్పిన్ బౌలింగ్‌కు ఉపయోగించుకోగా, మొయిన్ అలీతో ఒక్క ఓవర్ కూడా వేయించలేదు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా వికెట్లు సాధించి గేమ్ ఛేంజర్‌గా మారిన మొయిన్‌కు కేకేఆర్‌తో మ్యాచ్‌లో అసలు ఓవర్ కూడా ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జడేజా నాలుగు ఓవర్లలో 33 పరుగులతో పొదుపుగానే బౌలింగ్ చేసినా.. పేసర్లు శామ్ కర్రాన్, శార్దూల్ ఠాకూర్‌లను కేకేఆర్ బ్యాట్స్‌మన్ చితక్కొట్టారు. అయినా మొయీన్‌కు బౌలింగ్ ఇవ్వడంపై ధోనీ ఆలోచించలేదు. మొయిన్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కావడంతో రసెల్, కార్తీక్‌లు ఎటాక్ చేసి అవకాశం ఉందనే ఆలోచనతోనే మొయీన్‌ను ధోనీ పక్కన పెట్టాడా..? లేక వేరే కారణం ఏదైనా ఉందా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే డెత్ ఓవర్లలో నమ్మదగిన పేసర్ అవసరం ఉన్నప్పటికీ.. దీపక్ చాహర్‌తో 10 ఓవర్లలోపే పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ వేయించడం కూడా చాలా మందికి అర్థం కాని ప్రశ్నగా మిగిలింది.
డెత్ ఓవర్లలో చాహర్‌కు ఓవర్ ఉంచకపోవడం, మొయీన్ చేత బౌలింగ్ వేయించకపోవడం వంటి విషయాల్లో ధోనీ అంచనా తప్పిందనే విమర్శలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అయితే ఎన్‌గిడి ఉండడం వల్లనే ధోనీ చాహర్ చేత ధైర్యంగా ఓవర్లన్నీ 8 ఓవర్లలోపే వేచించాడని, దాని వల్ల ప్రతి ఓవర్లో ఓ వికెట్ చొప్పున చాహర్ మొత్తం నాలుగు వికెట్లు తీసి బ్రేక్ త్రూ ఇచ్చాడని ధోనీ సమర్థకులు అంటున్నారు. మరి దీనిపై ధోనీ ఎలా స్పిందిస్తాడో చూడాలి.