మూవీ: శుక్ర
నటీనటులు: అరవింద్ కృష్ణ, శ్రీజితా గోష్ తదితరులు
నిర్మాతలు: అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
సంగీతం: ఆశీర్వాద్
రచన-దర్శకత్వం: సుకు పూర్వజ్
కొన్ని సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని.. ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకులతో అనిపించుకుంటాయి. ఎప్పుడు విడుదలైనా అలాంటి సినిమాలు మంచి ఆదరణను పొందుతాయి. అలాంటి చిత్రాలలో తాజాగా విడుదలైన ‘శుక్ర’ చిత్రం కూడా ఒకటి నిలుస్తుంది. ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఒకవైపు కోవిడ్‌తో ప్రజలు భయపడుతున్నా.. థియేటర్స్‌కి అసలు వస్తారా? రారా? అనే సందేహాలు ఉన్నా.. సినిమా మీద నమ్మకంతో దర్శకనిర్మాతలు ఈ శుక్రవారం సినిమాని విడుదల చేశారు. అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన ఈ చిత్రం మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కినట్లుగా ట్రైలర్‌తోనే తెలిసిపోయింది. ఆద్యంతం ఆకట్టుకునే కథా కథనాలతో నూతన దర్శకుడు సుకు పూర్వజ్ ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా నిర్మాతలు తెలిపారు. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ శుక్ర చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
వైజాగ్ నగరంలో థగ్స్ అనే మాఫియా ముఠా వరుస నేరాలకు పాల్పడుతుంటుంది. డబ్బున్న కుటుంబాలను హతమార్చి లూటీలు చేస్తుంటుంది. నగరం నేరమయంగా ఉన్నప్పుడు ఇక్కడికి భార్యతో కలిసి వస్తాడు విలియమ్ అలియాస్ విల్లి (అరవింద్ కృష్ణ). అతనొక బిజినెస్ మెన్. సొంతంగా కంపెనీ నడుపుతుంటాడు. అతని వైఫ్ రియా(శ్రీజిత ఘోష్). రియాకు ఓ కోరిక ఉంటుంది. తన భర్త తనతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనే కోరికతో ఉంటుంది రియా. విల్లి బిజీ లైఫ్ వల్ల వైజాగ్ వచ్చాకే ఈ జంటకు ప్రైవసీ దొరుకుతుంది. ఇలాంటి సందర్భంలో రియా తన భర్తని ఓ కోరిక కోరుతుంది. తన బర్త్‌డేను హౌస్ పార్టీలా జరపాలని కోరుతుంది. ఆమె కోరిక మేరకు.. ఫ్రెండ్స్ అందరినీ పిలిచి హౌస్ పార్టీ చేస్తాడు విల్లి. అయితే ఈ పార్టీ జరిగిన రాత్రే రియా, మరో ఇద్దరు హత్యగావింపబడతారు. అసలు ఈ హత్యలకు కారణం ఏమిటి? ఎవరు ఈ హత్యలు చేశారు. హత్యలు చేసిన వారిని విల్లి ఎలా పట్టుకున్నాడనేది తెలియాలంటే.. సస్పెన్స్‌తో నిండిన ఈ థ్రిల్లర్ సినిమాని చూడాల్సిందే.
విశ్లేషణ:
ముందుగా ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కగా కుదిరారని చెప్పుకోవాలి. హీరో అరవింద్ కృష్ణ నటనలో చాలా మార్పు వచ్చింది. ఈ సినిమాలో అతని నటన హైలెట్ అనేలానే కాదు చాలా సహజంగా ఉంది. బిజినెస్ మ్యాన్‌గా, భార్య కోల్పోయిన ప్రేమికుడిలా వైవిధ్యభరితమైన నటనతో మెప్పించాడు. నేపథ్య సంగీతం మరో మెయిన్ హైలెట్. దర్శకుడు సుకు పూర్వజ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురిచేశారు. ప్రతి సన్నివేశాన్ని చాలా ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథ మీదున్న పట్టు, క్రియేటివ్ స్క్రీన్ ప్రెజెన్స్ సుకు చక్కగా ప్రదర్శించాడు. సినిమా రొమాంటిక్ సన్నివేశాలతో సరదాగా సాగుతూనే.. ఇంటర్వెల్‌కు అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ఈ ట్విస్ట్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ హత్యలకు కారణం ఓ స్మగ్లింగ్ ఇన్సిడెంట్ అని తెలిశాక.. సినిమాపై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అవుతుంది. సరికొత్తగా సుకు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆద్యంతం ప్రేక్షకులని ఆకట్టుకునేలా స్ర్కీన్‌ప్లే కూడా చక్కగా కుదిరింది. సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి కెమెరా పనితనం బాగుంది. హీరోయిన్ రియా క్యారెక్టర్‌లో నటించిన శ్రీజిత మంచి నటనను అలాగే గ్లామర్‌గానూ కనిపించి.. సినిమాకు మంచి ప్లస్ అయ్యింది. ఇతర పాత్రదారులు కూడా చక్కని నటనను కనబరిచారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం పర్ఫెక్ట్ చిత్రమని చెప్పొచ్చు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఎంత వరకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాలి.
ట్యాగ్‌లైన్: పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్
రేటింగ్: 3/5