నటీనటులు: గరుడ శేఖర్, సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె తదితరులు
బ్యానర్: కలెక్టీవ్ డ్రీమర్స్
సంగీతం: ప్రకాష్ రెక్స్
సినిమాటోగ్రఫీ: ఈశ్వరన్ తంగవేల్
ఎడిటర్: యోగ శ్రీనివాస్
నిర్మాత: లెల్ల శ్రీకాంత్
రచన- దర్శకత్వం: శివుడు
ఇప్పటి వరకు మద్యం వ్యసనానికి సంబంధించి సినిమాల్లో ఓ సపోర్టింగ్ క్యారెక్టర్‌ని మాత్రమే హైలెట్ చేస్తూ వచ్చారు దర్శకులు. కానీ ‘బ్రాందీ డైరీస్’లో మాత్రం మద్యమే ప్రధాన కథా వస్తువుగా తీసుకొని దర్శకుడు ఏకంగా ఓ ఫీచర్ ఫిల్మ్‌నే తెరకెక్కించాడు. పైగా ఇంటర్వ్యూలలో నా సినిమాలో ఆల్కహాలే హీరో అని చెప్పడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఆల్కహాల్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
వివిధ వృత్తులు.. అభిరుచులు కలిగిన ఐదు మంది జీవితాల్లో మద్యం ఎలాంటి ప్రధాన భూమిక పోషించి, వాళ్ళ లైఫ్‌ని టర్న్ చేసిందనేదే ఈ చిత్ర కథ. వృత్తిగతంగా ఒకరు… సంసార పరంగా మరొకరు… కెరీర్ పరంగా ఇంకొకరు.. ఇలా ఐదు మంది నిత్యం ఎలాంటి సంఘర్షణకు లోనయ్యారు. వాటిని ఎలా అధిగమించారు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
రోజూ మన చుట్టూ జరిగే రియల్ లైఫ్ స్టోరీస్‌ని.. రీల్ లైఫ్‌గా… ఫిలాసఫీని జోడించి ఓ వైవిధ్యమైన కథను తెరమీద అందంగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపూ… అరే… ఇలాంటి క్యారెక్టర్ మన వీధిలో రోజూ కనిపించేదే అనేంత రియల్ స్టిక్‌గా వెండితెరపై దర్శకుడు ఆవిష్కరించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె నటించారు. చిత్ర దర్శకుడు శివుడు తాను చెప్పాలనుకున్న కథని.. కథనంలో చర్చిస్తూనే ఆసక్తికరమైన సంభాషణలతో ముందుకు నడిపించాడు. ప్రధాన పాత్రలు పోషించిన సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె తమ పాత్రలకు న్యాయం చేశారు. వర్మ పాత్ర ద్వారా చాలా ఫిలాసఫీ చెప్పించారు దర్శకుడు శివుడు. అతను చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తాయి. శ్రీను, భవ్య మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌కు థియేటర్‌లో యూత్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇళ్లు, పిల్లలు, కుటుంబాన్ని పట్టించుకోని జాన్సన్ లాంటి పాత్రలను మనం ఎందరినో చూసి ఉంటాం. తన ఉద్యోగ ధర్మంగా పేదలకు సాయం చేయాలని చూసే డిప్యూటీ ఎమ్మార్వో శేఖర్ పాత్ర బాగుంది. భవ్య పాత్రలో సునీత ఆకట్టుకుంది. ఆమె స్మైల్, హావభావాలతో మెప్పించారు. ప్రకాష్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు పరవాలేదనిపించినా, నేపథ్య సంగీతం సినిమాకు బలం అని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నాణ్యమైన నిర్మాణ విలువలు చిత్రానికి అదనపు ఆకర్షణ. మొత్తంగా ‘బ్రాందీ డైరీస్’ నిత్యం ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే వాస్తవిక స్టోరీ. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. సరదాగా ఓ లుక్కేయవచ్చు.
సినీసర్కార్ ట్యాగ్‌లైన్: ఆల్కహాల్‌పై అవగాహన పెంచే సినిమా
సినీసర్కార్ రేటింగ్: 3/5