ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఢిల్లీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఓటమికి పూర్తి బాధ్యత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌దేనని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఢిల్లీ పరాజయానికి పంత్ చేసిన తప్పిదాలే కారణమని సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. తాను చూసిన అత్యంత పేలవమైన కెప్టెన్ పంత్‌దేనంటూ మండిపడ్డాడు.
ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీరూ పంత్‌పై నిప్పులు చెరిగాడు. అప్పటివరకు ఒక్క బంతి కూడా వేయని బౌలర్‌తో మ్యాచ్ ఆఖరి ఓవర్ వేయించడం, అది కూడా డివిలియర్స్ ఎదురుగా ఉన్నప్పుడు ఆ తప్పు చేయడం వల్లేనే ఢిల్లీ ఓడిందని అన్నాడు. పంత్ కెప్టెన్సీలో లోపమే దీనికి కారణమన్నాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి కెప్టెన్ ఆలోచనలు చేయాలని, దానికి అనుగుణంగానే వ్యూహాలు రచించాలని, కానీ పంత్ విషయంలో అవేవీ తనకు కనిపించలేదని వీరూ పేర్కొన్నాడు.
‘ప్రధాన బౌలర్ సరిగా బౌలింగ్ సరిగా చేయలేకపోతే కెప్టెన్ అంచనాలు తప్పువుతాయి. అప్పుడే కెప్టెన్‌గా బౌలింగ్ మార్పులు ఎలా చేయాలనేదాని గురించి ఆలోచించాలి. అందుకు అనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. అప్పుడే స్మార్ట్ కెప్టెన్ అనిపించుకుంటాడు. ఈ విషయంలో పంత్ అజాగ్రత్తగా వ్యవహిరించాడు. దానివల్లే అతడి జట్టు మ్యాచ్‌లో ఓడింది’ అని వీరూ చెప్పుకొచ్చాడు. అలాగే పంత్ ఇలాంటి తప్పిదాలు ఇక చేయడని అనుకుంటున్నానని, పంత్ ఒక మంచి కెప్టెన్ కావాలంటే స్మార్ క్రికెట్ ఆడాలని సూచించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో పంత్ కెప్టెన్సీకి తాను 10కి 5మార్కులు కూడా ఇవ్వలేనని, మూడు మార్కులు ఎలాగోలా ఇస్తానని సెహ్వాగ్ చెప్పాడు.
సెహ్వాగ్‌తో పాటు అదే షోలో పాల్గొన్న ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ.. మధ్య ఓవర్లలో పంత్ స్లో బ్యాటింగ్ చేయడమే ఢిల్లీ ఓటమికి కారణమని అభిప్రాయపడ్డాడు. ఛేజింగ్ చేసే క్రమంలో ఇద్దరు సెట్ అయిన బ్యాట్స్‌మన్ ఉండగా ఓటమి ఎదురుకావడం దారుణమని, అది కూడా కేవలం ఒక్క పరుగు తేడాతో పరాజయం చవిచూడడం పూర్తిగా ప్రణాళికా లోపమేనని అన్నాడు.