గత మ్యాచ్‌లో అజేయంగా 90 పరుగులకు పైగా సాధించి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ నేడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కనిపించలేదు. దీంతో పంజాబ్ అభిమానులంతా ఒక్కసారిగా షాకయ్యారు. అసలు రాహుల్ ఏమైపోయాడని ఆందోళన చెందారు. అయితే రాహుల్ ఆడకపోవడంతో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. కానీ గెలిపించలేకపోయాడు. ఢిల్లీ ముందు ఏ మాత్రం పోరాటం చూపకుండా ఓటమి చవి చూశాడు. తానొక్కడు 99 పరుగులతో అజేయంగా రాణించినా మిగా బ్యాట్స్‌మన్ అంతా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో మళ్లీ అభిమానుల ఆలోచన రాహుల్ వైపు మళ్లింది. దీంతో అతడు రాహుల్ ఎందుకు జట్టుకు దూరమయ్యాడనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. దీనికి ఆ జట్టు యాజమాన్యం ట్విటర్ వేదికగా ముందుగానే సమాధానమిచ్చింది.
శనివారం రాహుల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడని, జట్టు ఫిజియో వైద్యం చేసినా అతని శరీరం సహకరించలేదని ఫ్రాంచైజీ యాజమాన్యం వెల్లడించింది. దాంతో కేఎల్ రాహుల్‌కు సర్జరీ అనివార్యమవ్వడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తన ట్వీట్‌లో తెలిపింది. ‘నిన్న రాత్రి కేఎల్ రాహుల్ తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డాడు. వెంటనే టీమ్ ఫిజియో ప్రాథమిక చికిత్స అందించగా ఫలితం లేకపోయింది. అతడి కడుపునొప్పి తగ్గలేదు. దాంతో అతన్ని అత్యవసర చికిత్స కోసం తరలించి పలు పరీక్షలు చేశారు. రాహుల్ అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. సర్జరీ అనివార్యమైన నేపథ్యంలో వెంటనే కట్టుదిట్టమైన భద్రత మధ్య అతన్ని ఆసుపత్రికి తరలించాం’ అని ఫ్రాంచైజీ పేర్కొంది.
ప్రస్తుతం ఫ్రాంచైజీ చెబుతున్న దాని ప్రకారం రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. ఈ లెక్కన అతను బయో బబుల్ దాటినట్లే. అతను తిరిగొచ్చినా నిబంధనల ప్రకారం మరో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అంతేకాకుండా అతనికి సర్జరీ అనివార్యం అనే విధంగా ఫ్రాంచైజీ చేసిన ట్వీట్లో వెల్లడవుతోంది. ఒకవేళ సర్జరీ జరిగితే కచ్చితంగా 2నుంచి 3 వారాల విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మళ్లీ టోర్నీలో పాల్గొన్నా వారం క్వారంటైన్ తప్పనిసరి. అంటే కచ్చితంగా మరో నెల రోజులు టోర్నీకి రాహుల్ దూరమయ్యే అవకావాలున్నాయి. మరో నెలరోజుల్లో టోర్నీ పూర్తి కానున్న నేపథ్యంలో రాహుల్ ఇక టోర్నీ నుంచి వైదొలగినట్లేనని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే పంజాబ్‌కు భారీ దెబ్బనే చెప్పాలి. రాహుల్ గురించి తెలుసుకున్న పంజాబ్ కింగ్స్ అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.