ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తమ ఓటమికి గల కారణాన్ని పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వివరించాడు. తమ ఓటమిలో వాంఖడే పిచ్‌లో మంచు ప్రధాన కారణంగా మారిందని చెప్పాడు. ఈ పిచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసే జట్టుకు మంచు తీవ్ర ప్రతికూలమవుతోందని, దాని ప్రభావంతో బౌలర్లు ఏమీ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళికల్లో మంచు ప్రభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని, ఛేదన సమయంలో బౌలింగ్ చేసే జట్టు బంతిని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇక ఢిల్లీతో తమ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. తాము ఓ 15 పరుగులు వెనుకబడ్డామని, కానీ 196 పరుగుల లక్ష్యం కూడా అంత తక్కువేమీ కాదని, అయితే మంచు ప్రభావంతో తాము ఓడిపోయామని అన్నాడు. ఇక ఢిల్లీ బ్యాటింగ్‌లో శిఖర్ ధవన్ తమ నుంచి గెలుపును పూర్తిగా దూరం చేశాడని అన్నాడు. అయితే మ్యాచ్‌లో తాము బాగా ఆడామని, అయినా ఓడిపోవడం నిరాశ కలిగించిందని అన్నాడు. కానీ, ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, ఇక నుంచి గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని చెప్పాడు.
ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.2 ఓవర్లలోనే ఈజీగా ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 49 బంతుల్లోనే 92 పరుగులు చేసి శివమెత్తడంతో.. మయాంక్ (69), రాహుల్(61) శ్రమ వృథా అయింది. దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌కు చేరింది. పంజాబ్ ఏడో స్థానానికి పడిపోయింది.