చాలా రోజులుగా తన ఆట తీరు మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధవన్ చెప్పాడు. పంజాబ్‌తో మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌తో ధవన్ సరదా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బాగా ఆడానని, చెన్నై పిచ్‌లో కూడా ఎలా ఆడాలో ఇప్పటికే ప్రిపేర్ అయ్యానని ధవన్ చెప్పాడు.
‘ధాటిగా ఆడేందుకు వెనుకంజ వేయను. కొత్తగా ప్రయత్నించడానికి భయపడను. నెట్స్‌లో ఎంత బాగా సాధన చేస్తానో.. మ్యాచుల్లోనూ అదే స్థాయిలో ఆడేందుకు ప్రయత్నిస్తాన’ని ధవన్ చెప్పాడు. కొద్ది రోజులుగా లెగ్‌సైడ్ షాట్స్ ఆడటం సాధన చేస్తున్నానని, బౌలర్ల వేగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఆడేందుకు ప్రణాళిక వేస్తున్నానని తెలిపాడు. ఒక్కో బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ఆలోచించుకుంటానని చెప్పాడు. ఆ ప్లాన్‌ను అనుగుణంగానే అమలు చేస్తానని అన్నాడు. ఇక ఇటీవల తన స్లాగ్ షాట్ బాగా మెరుగుపడిందని, అందుకు ఆనందంగా ఉందని ధవన్ చెప్పాడు. ఇక తన సహచర ఆటగాడు పృథ్వీ షాతో ఓపెనింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. అంతేకాకుండా పంజాబ్‌తో మ్యాచ్ గెలవడం ఆనందాన్నిచ్చిందని, ఈ ఫామ్‌ను మిగిలిన టోర్నీ మొత్తం కొనసాగించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నాడు.
చెన్నై వికెట్ బ్యాటింగ్‌కు కష్టమని భావిస్తున్న తరుణంలో ఆ సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. ‘ చెన్నై వికెట్ చాలెంజ్‌కు సిద్ధంగా ఉన్నా. ఆ వికెట్ బాగా టర్న్ అవుతోంది. నేను టీవీలో చూసిన దాన్ని బట్టి చెన్నై వికెట్ ఎక్కువ స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఆ పిచ్ చాలా మందకొడిగా ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రిపరయ్యా. అక్కడ ఎలా ఆడాలో నాకు తెలుసు. ఎస్‌ఆర్‌హెచ్, ముంబై ఇండియన్స్ జట్లతో అక్కడే ఆడే మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్నా’ అని తెలిపాడు.