ప్రతి ఆటగాడూ తనదైన రోజున చెలరేగి ఆడతాడు. ఈ రోజు ఇంగ్లండ్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ రోజుగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో వీరవిహారం చేసి మైదానంలో బౌండరీల మోత మోగించాడు. ఢిల్లీ వేదికగా ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి సెంచరీతో కదం తొక్కాడు. అంతేకాదు.. ఈ శతకంతో అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. ఐపీఎల్ తొలి సెంచరీ సాధించడమే కాకుండా తన దేశం తరపున టీ20ల్లో శతకం బాదిన ఆటగాళ్ల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. ఏళ్లుగా తాను కంటున్న కలను నెరవేర్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా జట్టుకు భారీ విజయాన్ని కూడా కట్టబెట్టాడు.
ఆదివారం సాయంత్రం రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్.. 56 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్‌కు ముందువరకూ ఐపీఎల్‌లో బట్లర్ అత్యధికంగా 95 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా ఎప్పుడో 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అన్ని పరుగులు చేశాడు. అప్పటి నుంచి మూడేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నా ఒక్కసారి కూడా ఆ స్కోరు దాటలేకపోయాడు. కానీ ఈ రోజు రైజర్స్‌తో మ్యాచ్‌లో ఆ స్కోరును అధిగమించడమే కాకుండా ఏకంగా సెంచరీతో మెరిశాడు. అంతేకాదు సెంచరీతో తరువాత కూడా ధాటిగా ఆడుతూ.. 64 బంతుల్లోనే 11 ఫోర్లు.. 8 సిక్సర్లు 124 పరుగులు చేసి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే 19వ ఓవర్ ఆఖరి బంతికి సందీప్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి వెనుతిరిగాడు. కానీ అప్పటికే అతడు సృష్టించిన విధ్వంసానికి రైజర్స్ ఓటమి ఖరారైపోయింది.
కాగా. ఈ సెంచరీతో బట్లర్.. ఈ ఫీట్ సాధించిన నాల్గో ఇంగ్లిష్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటికే కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, జోనీ బెయిర్ స్టోల సరసన నిలిచాడు. దీనికి తోడు.. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ తరఫున రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని శామ్సన్‌తో కలిసి నెలకొల్పాడు. రెండో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని ఈ జోడి నెలకొల్పింది. రాజస్థాన్‌కు ఏ వికెట్‌కైనా ఇది రెండో అదిపెద్ద భాగస్వామ్యం. అయితే ముంబై ఇండియన్స్‌తో గతేడాది యూఏఈ వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్-శామ్సన్‌లు అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇది రాజస్థాన్‌కు అత్యధిక భాగస్వామ్యంగా ఉంది.