ఐపీఎల్-2021 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ వరుస పరాజయాల నేపథ్యంలో వార్నర్‌ను కెప్టెన్సీ కోల్పోయిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం… తుది జట్టు నుంచి కూడా వార్నర్‌ను తొలగించింది. అయినా వార్నర్ సహనం కోల్పోకుండా హుందాగా వ్యవహరించాడు. జట్టులో 12వ ఆటగాడిగా డ్రింక్స్ కూడా అందించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ ప్రస్తావించాడు. తనపై వేటు పడినా జట్టు ప్రయోజనాల గురించే వార్నర్ ఆలోచించాడని అన్నాడు.
కాగా.. జట్టులో వార్నర్‌ను తొలగిండచడం, దానికి తోడు అతడితో డ్రింక్స్, టవల్స్ మోయించడం ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. జట్టుకు తొలి ఐపీఎల్ కప్ సాధించి పెట్టిన కెప్టెన్‌ను ఇంతలా అవమానిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వార్నర్ మాత్రం ఈ విషయంపై కనీసం నోరు కూడా తెరవలేదు. అంతేకాదు డగౌట్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరుస్తూ తన అవసరం ఉన్నప్పుడల్లా సలహాలు, సూచనలు ఇచ్చాడు. దీంతో అతడి హుందాతనంపై అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాడిన్ వార్నర్‌ను అభినందించాడు.
‘బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చినా వార్నర్ బాధపడలేదు. ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చాడు. డ్రింక్స్ మోసుకుంటూ పరుగులు తీశాడు. జట్టు సమావేశాల్లో కూడా తన గొంతు బలంగా వినిపించేవాడు. కఠిన పరిస్థితులను అతడు డీల్ చేసిన విధానం అమోఘం’’ అంటూ వార్నర్ వ్యక్తిత్వాన్ని హడిన్ ప్రశంసించాడు.
ఇదిలా ఉంటే పటిష్ఠ బయోబబుల్ వాతావరణంలో నిర్వహిస్తున్నప్పటికీ ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఆరింటిలో ఓడిపోయి అభిమానులను నిరాశపరిచింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. అలాగే ఆడిన చివరి మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ మారినా ఎస్‌ఆర్‌హెచ్ రాత మాత్రం మారలేదు. ఆ మ్యాచ్‌లో కూడా దారుణంగా ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.