ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అదిరిపోయే బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తన అనూహ్యమైన బంతులతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి గాయాలతో చాలా ఇబ్బందులు పడిన ఆర్చర్.. టీమిండియాతో జరిగిన సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్థాన్ తరపున ఆడాల్సి ఉన్నా.. గాయాల కారణంగా పూర్తి టోర్నీకే దూరమయ్యాడు. అయితే తాజాగా గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్.. అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. త్వరలో ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం చెమటోడుస్తున్నాడు.
ఆర్చర్ ప్రస్తుతం ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ససెక్స్ తరపున ఆడుతున్న ఆర్చర్.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయిస్తూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యనే సర్రేతో జరిగిన మ్యాచ్‌లో బనానా ఇన్‌స్వింగర్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఔట్ చేసిన ఆర్చర్.. ఈసారి అంతకుమించిన బంతితో వికెట్ తీశాడు. గురువారం కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెంట్ బ్యాట్స్‌మెన్ డేనియలల్ బెల్‌ను ఆర్చర్ తన తొలి వికెట్‌గా దక్కించుకున్నాడు. ఆ తర్వాత 4వ ఓవర్‌లో జాక్ క్రాలీ వికెట్ పట్టేశాడు. 143కిమీ వేగంతో ఆర్చర్ విసిరిన ఆ బంతి క్రాలీ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియోను ససెక్స్ క్రికెట్ తన ట్విటర్‌లో షేర్ చేసింది. ”ఆర్చర్ ఆన్ ఫైర్.. దట్స్ ఏ స్నార్టర్” అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాతో తెగ ట్రెండ్ అవుతోంది.
“That’s a SNORTER!” 🎙️🔥
Two wickets already for @JofraArcher! 🤩 pic.twitter.com/HbaAthQv6h
— Sussex Cricket (@SussexCCC) May 13, 2021
ఇదిలా ఉంటే ఆర్చర్ త్వరలోనే న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. అలాగే టీమిండియాతో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌లోనూ ఆర్చర్ అడే అవకాశం ఉంది. అంతేగాక రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఆర్చర్ ఇంగ్లండ్ బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నాడు.