టీమిండియాలో రోహిత్ శర్మ ఎలాంటి హిట్టరో వేరే చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ కెరీర్‌లో డబుల్ సెంచరీలు, సెంచరీలు, అర్థ సెంచరీలతో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. హిట్ మ్యాచ్ అని పేరు తెచ్చుకున్నాడు. అయితే రోహిత్ మొట్టమొదట అర్థ సెంచరీ కొట్టింది మాత్రం ఓ కలిసిరాని బ్యాట్‌తో అట. అవును అప్పటి టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్‌కు ఏ మాత్రం కలిసిరాని బ్యాట్‌తో బరిలోకి దిగిన ఏకంగా అర్థ సెంచరీ బాదేశాడట రోహిత్. ఈ విషయాన్ని దినేశ్ కార్తిక్ స్వయంగా వెల్లడించాడు.
మంగళవారం 36వ జన్మదినాన్ని జరుపుకున్న డీకే.. తన కెరీర్లోని అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగానే రోహిత్ ఉన్న ఓ జ్ఞాపకాన్ని కూడా అందరికీ తెలియజేశాడు. 2007లో సౌత్‌ఆఫ్రికా గడ్డపై జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో తాను తిట్టుకుని, వద్దనుకున్న బ్యాట్‌ను రోహిత్ తీసుకున్నాడని, దానితోనే బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడని, 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడని డీకే గుర్తు చేసుకున్నాడు. అది రోహిత్ శర్మ తొలి అర్థసెంచరీ కావడమే కాకుండా.. తన బ్యాట్‌తో రోహిత్ ఆ ఘనత సాధించడం ఇప్పటికీ ఆనందాన్నిస్తుందని డీకే చెప్పుకొచ్చాడు.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. ఆ తర్వాత ఇండియా బౌలర్ల విజృంభణతో సౌత్‌ఆఫ్రికా 116 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి చవి చూసింది. అజేయ అర్థ సెంచరీతో మెరిసిన రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అయితే అదే మ్యాచ్‌లో 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తీక్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం కొసమెరుపు.