అదో నిర్మాణుష్యమైన బ్రిడ్జ్. ఓ బైక్ అటుగా వెళుతోంది. ఇంతలో బ్రిడ్ పక్క నుంచి ఓ వింత ఆకారం రోడ్డుమీదకొచ్చింది. దానిని చూసి వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అక్కడి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జార్ఖండ్ రాజధాని హజారిబాఘ్ సమీపంలోని ఓ బ్రిడ్జ్ మీద పరిస్థితి ఇదంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. మే 28న రాత్రి 8 గంటల సమయంలో బైకులపై వెళ్తున్న కొందరు ఆ వింత ఆకారాన్ని గుర్తించారని, వీడియో తీసి వైరల్ చేశారని ఏకంగా లోకల్ మీడియా ఛానెల్స్ కూడా ప్రత్యేక కథనాల్ని ప్రచురించాయి. దీంతో ఈ వీడియో మరింత పాపులర్ అయింది.
అయితే ఈ వీడియోపై హజారిబాగ్‌లోని పెలావాల్ స్టేషన్ ఇన్‌ఛార్జి వికర్ణ కుమార్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా వీడియో మా దృష్టికి వచ్చింది. ఛాద్వా డ్యామ్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఆరోజు వాతావారణం బాగోలేదు. పైగా బ్రిడ్జ్ దగ్గర్లో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తిరుగుతుంటాడు. బహుశా ఆ వ్యక్తే నగ్నంగా తిరిగి ఉంటాడని అనుమానిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. అలాగే ప్రాంక్ వీడియోలు తీసే ఆకతాయిలెవరైనా ఈ పని చేసి ఉంటారా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తూ జోకులు పేలుస్తున్నారు. ప్రాంక్‌స్టర్లు ఎవరో ఈ పని చేసి ఉండొచ్చని, క్యాస్టూమ్.. లైటింగ్ ఎఫెక్ట్‌తో అలా క్రియేట్ చేసి ఉండొచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఏలియన్లు వ్యాక్సినేషన్ కోసం వచ్చి ఉంటాయోమో అంటూ జోకులు పేలుస్తుంటే.. ఇంకొందరేమో ఈ వీడియో సంగతేంటో చూడాల్సిందిగా.. నాసాకి, ఎలన్ మస్క్‌కి ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.