యోయో టెస్ట్‌పై మాజీ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెటర్లను నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేయాలని, ఫిట్‌నెస్ టెస్ట్ కొలమానంగా కాదని వీరూ అన్నాడు. యోయో టెస్ట్ తప్పనిసరి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి తోడు యోయో టెస్ట్ రూల్స్‌ను ఈ మధ్య బీసీసీఐ మరింత కఠినతరం చేయడాన్ని తప్పుబట్టాడు. నైపుణ్యంతో ఏమాత్రం సంబంధంలేని ఈ ఫిట్‌నెస్ టెస్ట్ వల్ల అనేకమంది ప్రతిభగల ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను కోల్పోతున్నారని సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొద్ది కాలం క్రితం అంబటి రాయుడు, మహ్మద్ షమీ, సంజు శాంసన్ వంటి మేటి ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోవడానికి ఈ యోయో టెస్ట్ కారణమైందని, తాజాగా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు కూడా ఈ యోయో టెస్ట్‌కు బలయ్యారని, ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం దురదృష్టమని సెహ్వాగ్ అన్నాడు. ఒకప్పుడు కూడా యోయో టెస్ట్ ఉండి ఉంటే సచిన్, లక్ష్మణ్, గంగూలీ వంటి వారికి జట్టులో స్థానం లభించేది కాదని అభిప్రాయపడ్డాడు. ప్రతిభ లేని ఫిట్‌నెస్ వల్ల ఉపయోగం ఉండదని, ఆటగాళ్లను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలని, దీనిపై బీసీసీఐ ఆలోచించాలని అన్నాడు.
ఇదిలా ఉంటే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే ప్రతి ఆటగాడూ యోయో టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాలనే నియమాన్ని బీసీసీఐ 2018 నుంచి అమలులోకి తెచ్చింది. ఈ మధ్య ఆ నియమాలను మరింత కఠినతరం చేసింది. కనీస అర్హతను 16:1 నుంచి 17:1కి మార్చింది. అలాగే వికెట్ కీపర్, స్పిన్నర్, బ్యాట్స్‌మెన్ 8 నిముషాల 30 సెకండ్లలో 2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలని, పేసర్లు 8 నిముషాల 15 సెకండ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది.