ముందునుంచి అనుకున్నంతా జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 వాయిదా పడింది. ఈ మేరకు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) అధికారికంగా మంగళవారం ప్రకటన విడుదల చేసింది. దేశంలో కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఆటగాళ్లకు కూడా కరోనా సోకడం ఆందోళనకర విషయమని, ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నామని అధికారికంగా ప్రకటించింది. దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
బయోబబుల్ వాతావరణంలో ఉంటున్నప్పటికీ.. ఆటగాళ్లు ఒకరి తరువాత మరొకరు కరోనా బారిన పడుతుండడం సంచలనం రేపింది. దీంతో టోర్నీని వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేకపోయింది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్-19 సోకింది. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోని సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తిలకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.
బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. 8 ఫ్రాంఛైజీలు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా ఎవరికైనా కరోనా సోకిందేమో తెలుసుకునేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ వాయిదా పడటంతో క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురైనప్పటికీ ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సరైన నిర్ణయమే తీసుకున్నారని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన సీఎస్‌కే రెండో స్థానంలో ఉంది. వచ్చే నెల 30 వరకు టోర్నీ కొనసాగాల్సి ఉండగా ఇంకా 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.