ప్రపంచం తలకిందులైనా పొగరాయుళ్లకు పట్టదు. ఏది ఏమైనా టైంకి సిగరెట్, బీడీ ఏదో ఒకటి పీల్చకపోతే ప్రాణం పోయినట్లు ఉంటుంది. అయితే ఇది ఇంతకుముందు ఓకే కానీ. ఇప్పుడు.. అది కూడా ప్రస్తుత కరోనా టైంలో వీరి పరిస్థితి ఏంటేనేదే పరిస్థితి. అయితే ఓ తాత మాత్రం కరోనా ఉన్నా.. ఏమున్నా.. తాను దమ్ము కొట్టాల్సిందేనని ఫిక్స్ అయ్యాడు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. అతడు కరోనా పేషెంట్. వెంటిలేటర్‌పై ఉన్నాడు. ఒక పక్క ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని ప్రాణవాయువు పీలుస్తూ మరోపక్క ప్రాణాలను తీసే సిగరెట్‌ను గుప్పు గుప్పు మంటూ పీల్చి పొగ వదులుతున్నాడు. అదో సారి, ఇదో సారి. మార్చి మార్చి పీల్చుతున్న సదరు ముసలి తాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది అవగాహన కల్పించడం కోసం రూపొందించిన వీడియో అని తెలిసిన తర్వాత అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది.
పొగతాగేవారు యువకులైనా, పెద్దలైనా కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణుల హెచ్చరిక. ‘జో కోవిడ్ సింప్టమ్స్ స్టడీ యాప్’ డేటా ప్రకారం.. ఇతరులకంటే పొగ తాగేవారిలో కరోనా ప్రభావం 14 శాతం ఎక్కువగా ఉంటున్నట్లు వారు గుర్తించారు. దగ్గు, ఛాతీ నొప్పి, ఛాతీ వెనుక భాగంలో వేడి, వాసన, రుచి వంటివి పొగ తాగేవారు పూర్తిగా కోల్పోతున్నట్లు గుర్తించినట్లు అధ్యయనకర్తలు చెబుతున్నారు. కండరాల నొప్పి, ఆలోచనా శక్తి కోల్పోవడం, విరేచనాలు, అలసట వంటి ఆరోగ్య సమస్యలన్నీ రోగిలో తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కానీ పొగరాయుళ్లలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మరి దీనివల్ల విసుగు చెందాడో ఏమో కానీ, ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ‘తాత్కాలిక ఆనందం కోసం విలువైన జీవితాన్ని పణంగా పెడుతున్నారు. వారి వ్యసనం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో చూశాక అయినా ఇప్పటికైనా పొగరాయుళ్లలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.