దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు. ఇదీ ప్రస్తుతం దేశం దుస్థితి. ఈ క్రమంలోనే భారత్‌లోని కరోనా పరిస్థితిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్ పరిస్థితి చేస్తుంటే గుండె చెరువవుతోందని, మనసంతా బాధగా మారుతోందని పీటర్సన్ బాధపడ్డాడు. ఇప్పటివరకు కరోనా ఒకపక్క దేశాన్ని కలచివేస్తున్నా.. కనీసం మానసిక శాంతి ఐపీఎల్ వల్ల దక్కేది. కానీ ఈ మహమ్మారి ఐపీఎల్‌ను కూడా తాజాగా తాకడంతో గత్యంతరం లేక టోర్నీ వాయిదా పడింది. పలువురు ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారినపడడంతో టోర్నీని వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే పీటర్సన్ ట్విటర్ వేదికగా పై వ్యాఖ్యలు చేశాడు.
తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని, అలాంటి దేశంలో ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరమని, దీనిని తలచుకుంటేనే తన గుండె చెరువు అవుతోందని పీటర్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సందేశానికి చివర్లో కన్నీరు కారుస్తున్న ఎమోజీని ఉంచాడు. అలాగే దీని నుంచి భారత్ కచ్చితంగా త్వరలో బయటపడుతుందని, మరింత బలంగా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. భారత దేశంలోని ప్రజల మనసుల్లో ఉండే కరుణ, ఔదార్యం చాలా గొప్పవని, వాటి గొప్పతనం ఊరికే పోదని కెవిన్ భావోద్వేగంతో తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
ఐపీఎల్‌లో భాగంగా నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ కేకేఆర్ జట్టులోని సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి కరోనా బారినపడడంతో మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఆ వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ముగ్గురిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి కూడా కరోనా సోకినట్లు తేలింది. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ కేపిటల్స్ క్రికెటర్ అమిత్ మిశ్రా కూడా కరోనాతో జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీబీసీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.