ఓ స్టార్ క్రికెటర్‌ను కొంతమంది కిడ్నాప్ చేశారు. బంధించి దారుణంగా కొట్టి గన్‌తో బెదిరించి భారీ మొత్తం డిమాండ్ చేశారు. వారి చెర నుంచి తీవ్ర గాయాలతో బయటపడిన సదరు క్రికెటర్.. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇదంతా ఏదో సినిమాలో సన్నివేశం అనుకోకండి. నిజంగా జరిగింది. అయితే ఇండియాలో కాదు. ఆస్ట్రేలియాలో. అవును ఆసీస్ మాజీ స్పిన్నర్ స్టువర్ట్ మెక్ గిల్ అనే క్రికెటర్‌కు ఎదురైన ఘటన ఇది.
ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఒకప్పుడు స్టువర్ట్ మెక్‌గిల్ స్టార్ క్రికెటర్‌గా పేరు పొందాడు. ఇప్పుడు క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల స్టువర్ట్ ను ఎవరో ఆగంతకులు నలుగురు కిడ్నప్ చేశారు. గత నెల 14న ఈ ఘటన జరిగింది. ఓ వాహనంలో వచ్చిన దుండగులు మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేసి సిడ్నీ నుంచి దూరంగా తీసుకెళ్లారు. అక్కడ ఓ బిల్డింగ్‌లో బంధించి అతన్ని తీవ్రంగా కొట్టారు. గన్‌తో బెదిరించి భారీ మొత్తం నగదు డిమాండ్ చేశారు. అనంతరం గంట తర్వాత మెక్‌గిల్‌ను విడిచి పెట్టారు. అయితే ఈ ఘటన జరిగిన వారం తర్వాత మెక్‌గిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మెక్‌గిల్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. డబ్బుకోసమే సదరు కిడినపర్లు ఈ కిడ్నాప్ చేసినట్లు వెల్లడైంది వారు తెలిపారు.
కాగా స్టువర్ట్ మెక్‌గిల్ ఆసీస్ తరపున 2008-10 మధ్యకాలంలో 44 టెస్టులు ఆడి 208 వికెట్లు తీశాడు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మెక్‌గిల్ అరంగేట్రం చేశాడు. అతనితో పోటీ పడి వికెట్లు తీసినా.. వార్న్ మెరుపుల ముందు మెక్‌గిల్ చిన్నబోయాడు. దీనితో అతడు అంతగా పాపులర్ కాలేకపోయాడు.