నెలరోజులుగా అత్యంత కట్టుదిట్టంగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మంగళవారంతో వాయిదా పడింది. ఆటగాళ్లంతా బయోబబుల్ వాతావరణంలో ఉన్నా కరోనా బారిన పడడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ క్రమంలోనే అనేకమంది క్రికెటర్లు దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మరికొంతమంది మాజీలు టీ20 ప్రపంచకప్ పై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ వాయిదా ప్రభావం కచ్చితంగా టి20 ప్రపంచకప్ నిర్వహణపై కూడా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్‌లలో భారత్‌లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే తాజాగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో విదేశీ క్రికెటర్లు ఇక్కడికి రావడానికి వెనుకాడే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే సాధారణ ప్రజల విషయంలోనే అనేక దేశాలు భరత్ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. ఈ క్రమంలో 16 జట్లు టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొననున్నందున ఆయా దేశాలు ఒప్పుకోవనే భావన వ్యక్తమవుతోంది.
టోర్నీకి మరో 6 నెలలు ఉండడంతో పరిస్థితి మెరుగుపడవచ్చని ఆశిస్తున్నా.. క్రికెటర్లలో మాత్రం ఆందోళన పూర్తిగా తొలగిపోదని, ఆయా దేశాలు కూడా భారత్ లో టోర్నీ అంటే ఆలోచిస్తామని అంటున్నారు. నిజానికి ఐపీఎల్ ప్రారంభంలోనే కరోనా విషయంలో కొంత ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఎలాగో టోర్నీ మొదలైనా కొందరు ఆటగాళ్లు తమవారి క్షేమం గురించి ఆలోచించి టోర్నీ నుంచి వైదొలిగారు. చివరకు బాయిబాబుల్ ఉన్నా ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో టోర్నీని ఏకంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే అతి తక్కువ కేసులు ఉన్న సమయంలోనే 2020లో ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడిన నేపథ్యంలో రోజుకు దాదాపు 3 లక్షల కేసులు నమోదవుతున్న భారత్‌లో వరల్డ్‌కప్ అంటే సహజంగానే జట్లు వెనకడుగు వేస్తున్నాయి. భారత్‌లోనే సాధ్యం కాకపోతే యూఏఈని ప్రత్యామ్నాయ వేదికగా ఐసీసీ చూస్తోంది. ఒకవేళ యూఏఈలో జరిగినా నిర్వహణ బాధ్యతలు బీసీసీఐనే చూస్తుంది. అంటే ఒకవేళ అభిమానులను మైదానంలోకి అనుమతిస్తే టికెట్ ఆదాయం మన బోర్డుకే చెందుతుంది. త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ కరోనా మహమ్మారి క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగులుస్తోంది.