దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్నా ఐపీఎల్ మాత్రం కొనసాగింది. ఆటగాళ్ల కుటుంబాలు కరోనా బారిన పడుతున్నా.. ఆటగాళ్లు మాత్రం నిశ్చింతగా బయోబబుల్ వాతావరణంలో మ్యాచ్ లు ఆడుకుంటూ గడిపారు. కానీ అంత కట్టుదిట్టమైన ఆంక్షల్లో ఉన్నా కొందరు ఆటగాళ్లు కరోనా ఆరిన పడడం ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది. దీంతో ఎట్టకేలకు టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది.
ఐపీఎల్ అనూహ్యంగా వాయిదా పడటంతో దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపై చర్చ మొదలైంది. లీగ్ ఆగిపోవడంతో బీసీసీఐకి సుమారు రూ.2,200 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. లీగ్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా… 29 మ్యాచ్‌ల నిర్వహణ పూర్తయింది.
కాగా.. బోర్డుకు.. టోర్నీ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్, ఇతర స్పాన్సర్లతో ఉన్న ఒప్పందాల్లో ఎలాంటి షరతులు, నిబంధనలు ఉన్నాయనే అంశం బయటకు తెలియదు.అయితే అందరూ ఒక్కో మ్యాచ్ లెక్కన బోర్డుకు చెల్లిస్తారని తెలుస్తోంది. దీని ప్రకారం బీసీసీఐకి సాధారణంగా వచ్చే ఆదాయంలో దాదాపు 50 శాతం కోత పడిందనే వార్తలు వస్తున్నాయి. అయితే టోర్నీ ఈ ఏడాదికి పూర్తిగా రద్దయితేనే నష్టం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నష్టం మళ్లీ టోర్నీ నిర్వహించకపోతేనే అని తెలుస్తోంది.
ఐపీఎల్ 14వ సీజన్ కు స్టార్ స్పోర్ట్స్ ప్రసారకర్తగా… ‘వివో మొబైల్స్’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవి రెండూ ఇకపై పూర్తి చెల్లింపులు చేసే అవకాశం లేదని తెలుతోంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లకు కూడా సగం టోర్నీకి లెక్కగట్టి మ్యాచ్ ఫీజ్ చెల్లించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ నష్టంపై బీసీసీఐ కానీ, స్పాన్సర్లు కానీ మాట్లాడడం లేదు. ప్రస్తుతం దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఇలాంటప్పుడు లీగ్‌ను వాయిదా వేయాలనే బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని వారంటున్నారు. అలాగే ఆటగాళ్ల క్షేమం కూడా చాలా ప్రధానమని అందుకే టోర్నీ వాయిదా సరైన నిర్ణయమేనని చెబుతున్నారు.