కరోనా నేపథ్యంలో గతేడాది నుంచి క్రికెట్ ఆగిపోయింది. కానీ ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం తరువాత క్రికెట్ మళ్లీ మొదలైంది. కాని కరోనా భయంతో ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉండాలన్న నిబంధనను ఐసీసీ ప్రవేశపెట్టింది. అయితే ఇటీవల భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోబబుల్ విధానంపై పెదవి విరిచాడు. సుదీర్ఘకాలం బయో బబుల్‌లో ఉండడం ఆటగాళ్లకు కష్టమనీ.. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అందువల్ల అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారుపై పునరాలోచించాలని విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరాడు.
కోహ్లీ చేసిన సూచనను బీసీసీఐ తిరస్కరించింది. కోహ్లీ సూచనలు సమంజసమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయాలు తీసుకోలేమని తేల్చి చెప్పింది. ‘కోహ్లీ ఆందోళన సరైందే. కానీ, ఇందుకున్న ప్రత్యామ్నాయాలను చాలా తక్కువ. కేవలం రెండు పద్దతులను మాత్రమే పాటించగలం. వాటిలో ఒకటి రొటేషన్ పద్దతి. రెండోది అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించడం. ఈ రెండింటిని అమలు చేయడం మనకు అంత సులభం కాదు. వీటితో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములను దృష్టిలో ఉంచుకొని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సూచనను పాటించడం కుదరద’ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. అంతేకాకుండా బయో బబుల్ పద్ధతి కారణంగానే ఆటగాళ్లకు కరోనా సోకకుండా నియంత్రించగలుగుతున్నమని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ మొదలుకానుండగా ఈ చర్చలు జరగడం అభిమానుల్లో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. అయితే ఈ నెల 9వ తారీకు నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ పూర్తిగా బయోబబుల్ వాతావరణంలో జరగనుంది. అలాగే స్టేడియాలకు ప్రేక్షకులను కూడా బీసీసీఐ అనుమతించడం లేదు. అంటే పూర్తిగా ఖాళీ స్టేడియంలలో ఈ టోర్నీ ఆసాంతం జరగనుంది. కాగా.. అనేకమంది విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే బయోబబుల్ వాతావరణాన్ని భరించలేక టోర్నీకి దూరమవుతున్నారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు.