మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రాంరంభం కానున్న నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లను భారత్‌కు తీసుకురావడంలో బిజీబిజీగా ఉంది. అన్ని దేశాల నుంచి ఆటగాళ్లను తమ దేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చినవారికి పూర్తి స్థాయిలో వసతులు సమకూర్చి క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అయితే ఈ ఫ్రాంచైజీలకు ఆసీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా షాకులిస్తున్నారు. బయో బబుల్‌లో మరో రెండు నెలలు గడపడం ఇష్టం లేదంటూ వారంతా ఐపీఎల్‌లో ఆడలేమని తేల్చి చెబుతున్నారు. దీంతో ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. రెండు రోజుల క్రితం ఆసీస్ ఆల్‌రౌండర్ ఇదే మాట చెప్పి సన్‌రైజర్స్‌కు దూరం కాగా.. తాజాగా అదే దేశానికి చెందిన హేజల్‌వుడ్ కూడా ఐపీఎల్‌లో ఆడలేనని, బయోబబుల్ వాతావరణంలో ఇక బతకలేనని, కుటుంబంతో గడపాలనుకుంటున్నానని చెప్పి ఐపీఎల్ 2021 నుంచి సెలవు తీసుకున్నాడు.
సన్‌రైజర్స్ కీలక ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడనని తేల్చి చెప్పాడు. ‘బయోబబుల్ వాతావరణంతో విసిగిపోయా.. అందుకే ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనలేను’ అని హైదరాబాద్ ఫ్రాంచైజీకి మిచెల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. మిచెల్ మార్ష్ గత సీజన్ ఐపీఎల్‌లో ఆడినప్పటికీ.. గాయం కారణంగా సగం టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక ఈ సారి పూర్తి టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో సన్‌రైజర్స్ ప్రత్యామన్నాయాలను వెదుకుతోంది.
ఇక ఈ రోజు ఆసీస్ పేసర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. `దాదాపు 10 నెలల నుంచి బయో బబుల్, క్వారంటైన్‌లోనే ఉంటున్నాను. ఐపీఎల్ తర్వాత మరింత బిజీ షెడ్యూల్ ఎదురుకానుంది. సంవత్సర కాలంగా విశ్రాంతి లేకుండా వరుసబెట్టి సిరీస్‌లు ఆడుతూనే ఉన్నాము. మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుని కుటుంబంతో గడపాలని అనుకుంటున్నా`ని హేజల్‌వుడ్ చెప్పాడు. దీంతో చెన్నై జట్టుకు కీలక పేసర్‌ను కోల్పోయినట్లైంది.