అత్యంత భద్రత నడుమ గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కరోనా మహమ్మారి ప్రత్యక్షమైంది. దీంతో టోర్నీ అర్థాంతరంగా ముగిసిపోయింది. అయితే ఇప్పడు ఈ కరోనా మహమ్మారి బయోబబుల్ లోకి ఎలా ప్రవేశించినదే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఇంతకుముందు కూడా ఇదే తరహాలో కట్టుదిట్టంగా యూఏఈలో టోర్నీ నిర్వహించిన బీసీసీఐ.. ఈ ఏడాది ఎలా దెబ్బతిన్నదనే వాదన తెరమీదకొచ్చింది. అయితే కరోనా ఆటగాళ్లకు సోకడానికి గల కారణాలు తాజాగా వెలుగులోకి రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఐపీఎల్‌లో పాజిటివ్ కేసులు రావడానికి ఓ ఆటగాడే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
ఐపీఎల్ కమిటీ చేసిన విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ నెల 1న అహ్మదాబాద్‌లో ఉన్న వరుణ్ చక్రవర్తి కడుపులో సమస్య ఏర్పడడంతో స్కానింగ్ కోసం హోటల్ నుంచి బయటకు వెళ్లాడు. స్కానింగ్ పూర్తి చేసుకొని కాసేపటికి హోటల్‌కు తిరిగి వచ్చాడు. అయితే బయోబబుల్ రూల్ బ్రేక్ చేసిన అతడు.. క్వారంటైన్‌లో ఉండాలి. కానీ అతడు జట్టుతో కలిసిపోయాడు. ఆ తర్వాత సందీప్ వారియర్‌తో కలిసి ఓ హోటల్లో భోజనం కూడా చేశాడు. అనంతరం జట్టు సభ్యులతో ఒకే బస్సులో స్టేడియంకు చేరుకుని ప్రాక్టీస్‌కు హాజరయ్యారు. స్టేడియంకు వెళ్లిన తర్వాత వరుణ్.. తన ఆరోగ్యం సరిగా లేదని, ప్రాక్టీస్ చేయలేనని చెప్పడంతో విశ్రాంతి కోసం అక్కడే ఉన్న గదిలో ఉన్నాడు. మిగిలిన వారంతా ప్రాక్టీస్‌కు వెళ్లారు.
ఇక దీనికి తోడు బయోబబుల్ రూల్స్‌లో మరొకటి ఏ రెండు జట్లూ కలిసి ప్రాక్టీస్ చేయకూడదు. కానీ కేకేఆర్ ప్రాక్టీస్‌కు వెళ్లే సమయానికి అక్కడ ఢిల్లీ సభ్యులు కూడా ఉన్నారు. రూల్‌ను బ్రేక్ చేస్తూ కేకేఆర్ ఆటగాళ్లు ఢిల్లీ ఆటగాళ్లను కలిశారు. ఇక్కడే కీలక పరిణామం చోటు చేసుకుంది. వరణ్‌తో కలిసి భోజనం చేసిన సందీప్.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను కలిశారు. ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత హోటల్ గదికి వచ్చిన మిశ్రాకు అస్వస్థతగా అనిపించింది. అంతలోనే సందీప్‌లో కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీనికి తోడు వరుణ్ ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతిన్నది. దీంతో వారు ముగ్గురూ కరోనా పరీక్షకు వెళ్లడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఇక చెన్నై జట్టులో కరోనా ఎలా సోకిందనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా. ఓ జట్టు సభ్యుడు చేసిన చిన్న పొరపాటు వల్ల వేలాది కోట్ల టోర్నీ అర్థాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. చిన్న నిర్లక్ష్యానికి ఇంతపెద్ద భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.