దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించాలనే వాదనలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కేసుల పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఆంక్షలతో కూడిన లాక్ డౌన్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలైతే పరిమిత లేదా పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాయి. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలంటూ ప్రధాని మోదీపై కూడా ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించాలని ఒత్తిడి పెరుగుతున్నా.. మోదీ మాత్రం దీనికి విముఖంగా ఉన్నారని సమాచారం. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేసార్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ప్రస్తుతం దేశంలోని సగానికి పైగా జిల్లాల్లో కరోనా నియంత్రణలో ఉందని, అందువల్ల లాక్‌డౌన్ అవసరం లేదనేది ప్రభుత్వ వర్గాల వాదన. దేశవ్యాప్తంగా గతేడాది మాదిరిగా జాతీయస్థాయి లాక్ డౌన్ విధించడం వల్ల పేదలకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల గతేడాదిలానే ఎంతో మంది ఆకలితో మరణించే అవకాశం ఉందని, అది జరగకుండా ఉండేందుకే లాక్ డౌన్ విధించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అములు చేస్తుండగా.. మరికొన్ని పాక్షిక లాక్‌డౌన్, కర్ఫ్యూలను అములు పరుస్తున్నాయి. ఇంకొన్ని నైట్ కర్ఫ్యూలను విధిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే కేంద్రం అమలు చేయకపోయినా.. అనేక రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. తాజాగా మోదీ కూడా లాక్ డౌన్ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పడమే దీనికి కారణంగా తెలుస్తోంది.