కరోనాను ప్రపంచం మీద వదిలిందెవరంటే.. వెంటనే అంతా చెప్పే మాట చైనా. ఇది అధికారికంగా నిర్ధారణ కాకపోయినా.. చాలవారకు చైనా నుంచే కరోనా మహమ్మారి పుట్టిందని నమ్ముతారనడంతో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు చైనా మరో విలయాన్ని సృష్టించే దిశగా వెళుతోంది. అయితే ఈ సారి వైరస్‌ల ద్వారా కాదు. ఓ రాకెట్ రూపంలో. చైనా ప్రయోగించిన ఓ రాకెట్ ఈ హధ్య అదుపుతప్పింది. నియంత్రణ కోల్పోయి భూమి వైపు వేగంగా దూసుకొస్తుండడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఆ రాకెట్ సముద్రంలో కాకుండా ఏకంగా జనావాసాల్లో కూలిపోయే ప్రమాదముండడంతో ఇప్పుడు అంతా భయభ్రాంతులకు గురవుతున్నారు.
అంతరిక్షంలో ఇప్పటికే నాసాకు చెందిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ చక్కర్లు కొడుతోంది. దీంతో చైనా కూడా అలాంటి ఓ స్పేస్ సెంటర్‌ను అంతరిక్షంలో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటోందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత వారం లాంగ్ మార్చ్ 5బీ అనే పెద్ద రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రం కోర్ మాడ్యూల్‌ను అది విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. దీంతో చైనా.. తన కల నెరవేరినట్లేనని భావించింది. కానీ కొద్ది సేపటికే ఆ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. దీంతో ఇది తిరిగి భూమిపై కూలే ప్రమాదం ఉందని అంతరిక్ష నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడే ముప్పు ఉన్నట్లు వారు ప్రకటించడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
ఈ రాకెట్ శకలాలు మే 8న భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని, అలా వచ్చిన శకలాలు భూ వాతావరణంలోకి చేరగానే విస్ఫోటనం చెంది ఎక్కడెక్కడో కూలిపోతాయని చెబుతున్నారు. దీనివల్ల భయంకరమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించగానే.. రాకెట్ శకలాలు భస్మమైపోతాయని, భయపడాల్సిన పని లేదని అంటున్నారు. కానీ ఈ వాదనను అధికశాతం నిపుణులు కొట్టిపారేస్తున్నారు. 22 టన్నుల రాకెట్ పూర్తిగా కాలి బూడిద కావడం అసాధ్యమని, నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆ రాకెట్ ప్రయాణ మార్గాన్ని యూఎస్ స్పేస్ కమాండ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని అమెరికా రక్షణ విభాగం అధికార ప్రతినిధి మైకో హోవర్డ్ వెల్లడించారు. ఐతే భూవాతావరణంలోకి ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది ఎక్కడ కూలిపోతుంది అనేది ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. కాగా.. గత ఏడాది కూడా చైనాకు చెందిన రాకెట్ కూలిపోయింది. ఐవరీ కోస్ట్‌లోని జనవాసాల్లో పడడంతో పలు గ్రామాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.