కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ను హైకోర్టు తీవ్రంగా మందలిస్తోంది. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కన్నెర్ర జేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గడంపై కూడా అసహనం వ్యక్తం చేసింది. రోజుకు లక్ష కరోనా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వీకెండ్ లాక్‌డౌన్ గురించి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో వెంటనే కోర్టుకు తెలియజేయాలని హుకుం జారీ చేసింది. వీకెండ్ లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ వేళల పొడగింపు విషయాన్ని ప్రభుత్వం పరిశీలించి వెంటనే ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు(బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలోనే వీకెండ్ లాక్‌డౌన్, కర్ఫ్యూ వేళల పెంపు విషయంలో 8వ తేదీ కంటే ముందుగా ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, ఔషధాల గరిష్ట ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని, దీనిపై తాజా మార్గదర్శకాలను విడుదల చేయాలని సూచించింది.
అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలో టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లే.. వారంలోగా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఇక జైళ్లలో ఉన్న ఖైదీలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ సమావేశాలకు సంబంధించిన వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఔషధాల అక్రమ విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని, ఫంక్షన్ హాళ్లు, పార్కులు, మైదనాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా శుభకార్యాలు జరుగుతుంటే వేడుకల్లో 200 మందికి మించకుండా చూడాలని సూచించింది. ఇక అంత్యక్రియల్లో కూడా జనాభా సంఖ్య 50కి మించి పాల్గొనకుండా చూడాలని, కరోనా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.