అత్యంత భద్రత నడుమ గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కరోనా మహమ్మారి ప్రత్యక్షమైంది. దీంతో టోర్నీ అర్థాంతరంగా ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి బయోబబుల్ లోకి ఎలా ప్రవేశించినదే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఐపీఎల్ వాయిదా పడడంతో ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధానంగా ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరిస్థితి దారఉనంగా ఉంది. భారత్ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు అనుమతి లేనందున.. వారు మొదట మాల్దీవులకు వెళ్లనున్నారు. అక్కడ దాదాపు 15 రోజులు గడిపిన తర్వాత స్వదేశానికి బయలుదేరనున్నారు. ఐపీఎల్‌లో ఉన్న దాదాపు 40 మంది ఆసీస్ ఆటగాల్లు రెండు రోజుల్లో మాల్దీవులకు బయలుదేరనున్నారు. వీరందరినీ స్వదేశానికి పంపించే బాధ్యతను బీసీసీఐ తీసుకుంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన హస్సీ మాత్రం 10 రోజులు ఇండియాలోనే ఉండనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఇక మిగతా దేశాల ఆటగాళ్లను కూడా బీసీసీఐ వారివారి సొంత దేశాలకు పంపుతోంది. ఇప్పటికే 11 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు స్వదేశానికి పంపించింది. వీరిలో బట్లర్, మొయిన్ అలీ, శామ్ కరన్, టామ్ కరన్, వోక్స్, బెయిర్ స్టో, జేసన్ రాయ్, శామ్ బిల్లింగ్స్ బుధవారం ఇంగ్లండ్ చేరుకున్నారు. ఈ విషయాన్ని ఈసీబీ అధికారికంగా ప్రకటించింది. ఇంకా మోర్గాన్, మలాన్, జోర్డాన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్ చేరుకున్న ఆటగాళ్లంతా నేరుగా తమ ఇళ్లకు వెళ్లేందుకు వీల్లేదంటూ ఈసీబీ హెచ్చరించింది. 10రోజుల పాటు ఓ హోటల్లో క్వారంటైన్లో ఉండి కరోనా రిపోర్టులు పూర్తిగా నెగెటివ్ వచ్చిన తరువాతనే వీరిని ఇళ్లకు అనుమతిస్తారు.
న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా స్వదేశానికి పయనమయ్యారు. అయితే.. కొందరు మాత్రమే స్వదేశానికి వెళుతున్నారు. మొత్తం 17 మంది సభ్యుల్లో వచ్చే నెల ఇండియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సిన జట్టులో సభ్యులైన కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమీసన్, శాంట్నర్, ఫెర్గూసన్, నీషమ్, ఫిన్, అలెన్ ఉన్నారు. అయితే భారత్ విమానాలపై ఇంగ్లండ్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో మే 10 వరకు ఇండియాలోనే వీరంతా ఉండనున్నారు. మిగిలిన న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫ్లెమింగ్, మెక్ కల్లమ్, మిల్స్, షేన్ బాండ్ తదితరులు స్వదేశానికి బయలుదేరనున్నారు. వీరికోసం రెండు ప్రాంఛైజీలు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.