అత్యంత పటిష్ఠ బయోబబుల్ వాతావరణంలో నిర్వహిస్తున్నప్పటికీ ఐపీఎల్ 14 సీజన్‌లో ఆటగాళ్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే బీసీసీఐ టోర్నీని అర్థాంతరంగా నిలిపివేసింది. అప్పటికి కేవలం సగం టోర్నీనే పూర్తయింది. అనంతరం విదేశీ ఆటగాళ్లంతా తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. స్వదేశీ ఆటగాళ్లు కూడా ఇళ్లకు చేరుకున్నారు. అయితే అనుకోకుండా టోర్నీ వాయిదా పడడంతో బీసీసీఐకి వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో ఎలాగైనా మిగతా సగం టోర్నీని యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ తెగ కసరత్తు చేస్తోంది. దీనికోసం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను కూడా రద్దు చేసుకుంది. మే 29న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధికారిక ప్రకటన వెలువరించాలని భావిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో బీసీసీఐకి భారీ షాక్ తగలింది.
ఐపీఎల్ లీగ్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లదేశ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనడం అనుమానంగా మారింది. ఈ పర్యటనలో ఆసీస్ 5 టీ20లు ఆడనుండగా, సిరీస్ పూర్తయ్యే సరికి ఐపీఎల్ సెకండాఫ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తవుతాయి.
ఈ ఐపీఎల్ సీజన్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 13 మంది ఆసీస్ స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. వీరంతా లీగ్‌కు దూరమైతే టోర్నీ కళావిహీనంగా మారుతుంది. గాయాల బారినపడి ఇది వరకే చాలా మంది స్టార్లు లీగ్‌కు దూరం కాగా, కొత్తగా ఆసీస్ ఆటగాళ్లంతా మూకుమ్మడిగా దూరమైతే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఆసీస్ ఆటగాళ్లు లేకుండా లీగ్ పునఃప్రారంభిస్తే ఉపయోగం ఉండదని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బంగ్లాదేశ్ పర్యటన విషయమై బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరిపి ఎలాగైనా పర్యటనను రద్దు చేసేలా చేస్తుందని పలువురు ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానుల నమ్మకం.