అత్యంత భద్రత నడుమ గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కరోనా మహమ్మారి ప్రత్యక్షమైంది. దీంతో టోర్నీ అర్థాంతరంగా ముగిసిపోయింది. అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఐపీఎల్ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కాదులెండి. సెప్టెంబరులో. సీజన్ సెకండ్ షెడ్యూల్‌ను ఎప్పుడు పూర్తి చేయాలన్న విషయంపై ఇప్పటికే బీసీసీఐ కసరత్తు ప్రారంభించేసిందట. ఎప్పుడు నిర్వహించాలి..? ఏ వేదికలలో నిర్వహించాలి..? అనే విషయాలపై ఐపీఎల్ పాలక మండలి మల్లగుల్లాలు పడుతోందట. ఇతర దేశాల క్రికెట్ షెడ్యూళ్లను అనుసరించి సెప్టెంబర్లో రెండో దశను నిర్వహిస్తే బాగుంటుందని బోర్డు పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.
ఇక ఇది మాత్రమే కాకుండా వేదికల విషయంలో కూడా బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. యూఏఈ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఏదో ఒక దేశంలో మలి దశ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జులైలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ ఇందులో తలపడనున్నాయి. టెస్టుకు కొన్ని రోజుల ముందుగానే కోహ్లీసేన అక్కడికి చేరుకోనుంది. ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో తలపడనుంది. సెప్టెంబర్‌తో ఆ సిరీస్ కూడా ముగుస్తుంది. దాంతో అదే నెలలో ఐపీఎల్ మిగిలిన మ్యాచులను నిర్వహించాలని, అది కూడా ఇంగ్లండ్ వేదికగానే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట.
ఇక గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ.. ఈ సారి కూడా అక్కడికే వేదికను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్ ముగియగానే నేరుగా ఇంగ్లండ్, భారత ఆటగాళ్లను దుబాయ్‌కు తీసుకెళ్లాలని బీసీసీఐ భావిస్తోందట. అయితే సెప్టెంబర్లో యూఏఈలో ఎండలు విపరీతంగా ఉండడం ప్రతికూలంగా మారే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో పాటు మూడో ప్రత్యామ్నాయంగా.. ఆస్ట్రేలియాను బీసీసీఐ దృష్టిలో పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ నుంచి ఎవరినీ ఆ దేశానికి అనుమతించడం లేదు. అయితే సెప్టెంబరు నాటికి పరిస్థితులు చక్కబడితే అక్కడ ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందని కూడా బీసీసీఐ భావిస్తోందట. మరి ఈ ముడూ వేదికల్లో బీసీసీఐ ఏది ఫైనల్ చేస్తుందో చూడాలి. అయితే సెప్టెంబరు నాటికి నిజంగా పరిస్థితులు చక్కబడతాయా..? అనే విషయం కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది.