వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు మాత్రమే విరుగుడుగా పనిచేస్తుండటంతో అన్ని దేశాలూ టీకాలపై పెట్టాయి. కానీ అగ్రరాజ్యాల ఏకపక్ష వైఖరి కారణంగా పేద దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ముడి సరుకులను అమెరికా నిలిపేయడంతో భారత్ లాంటి మధ్యస్త దేశాలూ తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. అంతర్జాతీయంగా ఓ విధానమే లేకపోతే రాబోయే రోజుల్లో మరింత విలయం తలెత్తే పరిస్థితి నెలకొందని ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఓ కీలక ప్రతిపాదనను ప్రపంచం ముందుకు తెచ్చింది. ఈ విధానానికి అమెరికా మద్దతు తెలపడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కరోనా పోరాటంలో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా చెప్పింది. టీకా పేటెంట్ల మినహాయింపుపై భారత్ చేస్తున్న పోరాటంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ కొవిడ్ బుధవారం వెల్లడించారు.
అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటీవ్ కేథరిన్ టై బుధవారం మాట్లాడుతూ ‘వ్యాపారాలకు మేధో హక్కుల రక్షణ అత్యంత కీలకమైందే. కానీ, కొవిడ్ టీకాకు సంబంధించి మాత్రం ఇటువంటి రక్షణను తొలగించాలన్న వాదనకు అమెరికా మద్దతు పలుకుతోంది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి అనేది అంత్యంత అసాధారణ సందర్భం. ఇలాంటి స్థితిలో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాలి. టీకాల తయారీ, పంపిణీకి సంబంధించిన వ్యవస్థలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తాము. టీకాల తయారీకి అవసరమైన ముడిపదార్థాల ఉత్పత్తిని పెంచుతామ’ని ఆమె పేర్కొన్నారు.
అమెరికా నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డీజీ ట్రెడ్రోస్ అథానోమ్ గెబ్రియోసిస్ స్వాగతించారు. అమెరికా నిర్ణయం చారిత్రకమని ఆయన అభినందించారు. కొవిడ్‌పై పోరులో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. అయితే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మాన్యు ఫ్యాక్చరర్స్ అసోసియేషన్ లాబీ మాత్రం అమెరికా నిర్ణయం నిరాశకు గురిచేసినట్లు పేర్కొంది. ‘మినహాయింపులు ఇవ్వడం తేలికే.. ఓ క్లిష్టమైన సమస్యకు ఇదొక తప్పుడు పరిష్కారం’ అని విమర్శలు గుప్పించింది.