రాష్ట్రంలో తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహన సంఘటన గుర్తుందా..! సరిగ్గా అలాంటి ఘటనే జిల్లా లోని శివవంపేటలో చోటుచేసుకోబోయింది. అయితే చుట్టుపక్కల జనాలు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
మండల తహశీల్దార్ భానుప్రకాశ్‌పై స్థానిక రైతులు డీజిల్ పోయడంతో తహసీల్దార్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో వివాదం సర్దుమణిగింది.
వివరాల్లోకి వెళితే.. సోమవారం తాళ్లపల్లి తండాలో రైతు మాలోత్ బాలు విద్యుదాఘాతంతో మృతిచెందారు.
తహసీల్దార్ భానుప్రకాశ్ సకాలంలో పట్టా పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. ఈ కారణంగానే మాలోత్ బాలుకు బీమా రాలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మంగళవారం రైతులంతా మాలోత్ బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తహశీల్దార్ కార్యలయం లోనికి దూసుకెళ్లిన రైతులు.. ముందుగా తమపైనే డీజిల్ పోసుకున్నారు.
ఆ తరువాత తహశీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్ పోశారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.