రాష్ట్రంలోని విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇవ్వాలని సీఎం సూపర్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించేలా ‘స్టూడెంట్ క్రెడిట్ కార్డు’ పథకాన్ని ప్రవేశ పెట్టారు.
ఆనందపడకండి.. ఇది మన రాష్ట్రంలో కాదు.. పశ్చిమబెంగాల్‌లో. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ స్క్రీంను ప్రారంభించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఆమె కోల్‌కతాలో ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, బెంగాల్ యువత స్వావలంబన కోసం వార్షిక సాధారణ వడ్డీతోనే రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నామని చెప్పారు.
బెంగాల్‌కు చెందిన ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులు, కోచింగ్ సెంటర్లలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు.. అందరికీ ఈ పథకం వర్తింస్తుందని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేస్తోందని స్పష్టం చేశారు.
దీనికి సంబంధించిన వివరాలను విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వివరించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్నిఅమలు చేయనుందని చెప్పారు.
నిజానికి ఈ పథకం గురించి గతంలోనే దీదీ సర్కార్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ‘15 ఏళ్లలో తిరిగి చెల్లించే కాల పరిమితితో 4 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.10లక్షలు రుణం విద్యార్థులకు అందుతుంద’ని వివరించారు.