కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే కోవిడ్ టీకా వేసుకోవాలి. అయితే కోవిడ్ టీకా కోసం వెళ్లి కుక్కకాటుకు వేసే టీకా వేయించుకుంది ఓ మహిళ.
ఈ ఘటన నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కట్టంగూర్ మండలం బొల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో స్కావేంజర్‌గా పనిచేస్తున్న పీ ప్రమీల.. మంగళవారం కరోనా టీకా కోసమని కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది.
అక్కడి సిబ్భంది ద్వారా టీకా వేయించుకుంది. అయితే తనకు వేసింది కోవిడ్ టీకా కాదని, కుక్కకాటుకు వేసే టీకా అని తెలిసి షాకయ్యింది.
ప్రమీల పని చేస్తున్న పాఠశాల హెచ్‌ఎం.. ప్రమీలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని వైధ్యాధికారిని కోరుతూ లేఖ రాసి ప్రమీలకిచ్చి పంపించారు.
వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుని రమ్మని పంపించారు. అది లేఖ తీసుకుని ఉదయం 11 గంటలకు కట్టంగూర్ పీహెచ్ సీకి చేరుకున్న ప్రమీల.. కరోనా టికాలు ఎక్కడ వేస్తున్నారో తెలియక యాంటీ రేబీస్ టీకాలు వేసే లైన్‌లో నిలబడింది.
తన ముందు ఉన్న మహిళకు నర్సు ఏవీఆర్ వ్యాక్సిన్ ఇచ్చింది. తరువాత అదే సూదితో ప్రమీలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చింది.
అయితే ఇద్దరికి ఒకే సిరంజితో టీకాను ఎలా ఇస్తారని ప్రమీల ప్రశ్నించగా, నర్సు వినిపించుకోకుండా అక్కడి నుండి విళ్లిపోయింది.
అదే సమయంలో పక్కనే ఉన్న వారు.. ప్రమీల వద్ద ఉన్న లెటర్ చూసి.. ఆమె కోవిడ్ వ్యాక్సిన్ కోసం వచ్చినట్లు గ్రహించారు. వెంటనే ఆమెకు వేసింది కోవిడ్ టీకా కాదని, కుక్కకాటుకు టీకా అని తెలిపింది. దీంతో ప్రమీల ఆందోళనకు గురైంది.
అయితే వైద్యాకారి కల్పన.. మాట్లాడుతూ.. ప్రమీలకు ఇచ్చింది ఏఆర్ వీ కాదని, సాధారణ టీటీ ఇంజెక్షన్ అని స్పష్టం చేశారు. టీటీతో ఎలాంటి ప్రమాదం ఉండదని వివరణ ఇచ్చారు.