ఒకప్పుడు ఒకే రాష్ట్రమైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లు నీటి కోసం కర్ణాటకతో కొట్లాడేవి. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి.. ఒకరితో ఒకరు నీటి కొట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తారస్థాయికి చేరుతోంది. ఏకంగా ముఖ్యమంత్రులే రంగంలోకి దిగి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుండడంతో కేంద్రానికి లేఖలు రాస్తుండడం సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది.
ప్రధానంగా శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం నీటిని అక్రమంగా తరలిస్తోందని ఏపీ ప్రభుత్వం తెలంగాణపై ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఏకంగా కేంద్రానికి కూడా లేఖ రాసింది. మరో పక్క ఏపీలో నిర్మిస్తున్న పొతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం అక్రమమంటూ తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. ఏకంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరీ కేసీఆర్.. ఈ ప్రాజెక్టుపై నిప్పులు చెరిగారు. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం రాయలసీమకు నీరందించేలా మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది.
కడప జిల్లా చక్రాయపేట మండలంలోని తక్కళ్లపల్లె డ్యాం వద్ద ఈ కొత్త ఎత్తిపోతల పథకం ప్రారంభం కానుంది. దీని నిర్మాణానికి చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఎంపీ అవినాస్ రెడ్డి భూమి పూజ చేశారు. రూ.5 వేల కోట్లతో ప్రారంభించే ఈ పనుల వల్ల కాలేటి వాగు, వెలిగల్లు ప్రాజెక్టులకు నీరు ఎత్తిపోయవచ్చని, రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలనూ సస్యశ్యామం చేసే విధంగా ఈ ఎత్తిపోతల పథకాలు ఉంటాయని ఎంపీ అవినాస్ రెడ్డి చెప్పారు. అంటే ఈ ప్రాజెక్టుతో కూడా రయలసీమకు నీటిని అందించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకెలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.