సినీ కళాకారుల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం చొరవ చూపాలని పలువురు వక్తలు సూచించారు.చిత్ర పరిశ్రమను నమ్ముకొని 24 క్రాఫ్ట్స్(కళలు)లో రాణిస్తున్న అనేక మంది కళాకారులు కోవిడ్ కారణంగా సుమారు 18నెలల నుంచి ఆర్థిక పరమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం సింధూర ఫంక్షన్ హాల్ లో సినీ కళాకారుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఏ.ఎం.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ రాపేటి అప్పారావు, రైటర్స్ అకాడమీ అధ్యక్షులు వి.వి.రమణమూర్తి, మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నాయకులు దాడి సత్యనారాయణ, సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ సామాజిక విశ్లేషకులు సన్ మూర్తి, ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు నరవ ప్రకాశరావు, దర్శకులు యాద్ కుమార్, సినీనటుడు ప్రసన్న కుమార్, ఎఫ్.ఎం.బాబాయ్, ఏపీ మా అధ్యక్షులు ఎం.కృష్ణ కిషోర్, శివజ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ తద్వారా కళాకారుల సమస్యలు ఏ మాత్రం పరిష్కారం కావడం లేదని వాపోయారు. చిత్ర పరిశ్రమను నమ్ముకొని లక్షలాదిమంది జీవిస్తున్న సందర్భంలో ప్రభుత్వం దీనిపైన చిన్న చూపు చూడడం తగదని పేర్కొన్నారు. ప్రతి కళాకారుడికి ప్రభుత్వం ద్వారా భృతి కల్పించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. లైట్ బోయ్ మొదలు నిర్మాత స్థాయి వరకు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు రమేష్ యాదవ్, అక్షరం రైటర్ బాబా, బాబుదేవ్, గీతాలయ ప్రసాద్, శివజ్యోతి, పూతి వెంకట్ రెడ్డి, చిట్టితల్లి ఫేమ్ రవితేజ, జోలాపుట్ ఈశ్వర్, రాజారావు, తదితరులు తమ సమస్యలను వెల్లడించారు. అనంతరం గతంలో సినిమాలకు సేవలందించిన నారాయణరావు, గంగాధర్ లకు సంతాపం ప్రకటించి నివాళులర్పించారు.